Renault Duster : వ్యాగన్ ఆర్ మైలేజీ..ఫార్చ్యూనర్ రేంజ్..రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ దెబ్బకు పెట్రోల్ బంకులు మూతే
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ దెబ్బకు పెట్రోల్ బంకులు మూతే

Renault Duster : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ భారత మార్కెట్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఒకప్పుడు ఎస్‌యూవీ మార్కెట్‌ను ఏలిన డస్టర్ ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ అవతారంలో రీఎంట్రీ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల హడావిడి ఉన్నప్పటికీ, ప్రాక్టికల్ గా ఆలోచించే వారి కోసం రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ హైబ్రిడ్‌ను రంగంలోకి దించుతోంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తే ఏకంగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఏడాది జనవరి 26న అధికారికంగా ఆవిష్కరించబడిన ఈ మోడల్, దీపావళి 2026 నాటికి భారత రోడ్లపై పరుగులు తీయనుంది.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌లో యూరప్‌లో విజయవంతమైన E-Tech 160 పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో 1.8 లీటర్ల 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (36 kW ఈ-మోటార్, 15 kW హై-వోల్టేజ్ స్టార్టర్ జనరేటర్) ఉంటాయి. దీనితో పాటు 1.4 kWh బ్యాటరీ ప్యాక్, అత్యాధునిక మల్టీ-మోడ్ క్లచ్‌లెస్ గేర్‌బాక్స్ ఉంటుంది. నగరాల్లో డ్రైవ్ చేసేటప్పుడు 80 శాతం ప్రయాణం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సాగుతుందని కంపెనీ చెబుతోంది, దీనివల్ల మైలేజీ అద్భుతంగా ఉంటుంది.
సాధారణంగా ఎస్‌యూవీలు అంటే తక్కువ మైలేజీ ఇస్తాయని పేరు. కానీ డస్టర్ హైబ్రిడ్ లీటరుకు 25 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని అంచనా. ఇది మారుతి వ్యాగన్ ఆర్ వంటి చిన్న కార్ల మైలేజీతో సమానం. పాత డస్టర్‌లో 70 శాతం విక్రయాలు డీజిల్ మోడల్‌దే ఉండేవి. ఇప్పుడు బీఎస్-6 నిబంధనల వల్ల డీజిల్ ఇంజిన్‌ను పక్కనపెట్టిన రెనాల్ట్, ఆ లోటును ఈ హైబ్రిడ్ టెక్నాలజీతో భర్తీ చేయాలని చూస్తోంది.
కొత్త డస్టర్ రగ్డ్ లుక్‌తో పాటు లోపల లగ్జరీ ఫీచర్లతో నిండి ఉంది. 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, గూగుల్ ఇన్-బిల్ట్ ఓఎస్, పానోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ఏడాస్ (ADAS), వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర సుమారు రూ.18 లక్షల నుంచి రూ.23 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

