2026లో రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే

Upcoming SUV : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవానే నడుస్తోంది. మరీ ముఖ్యంగా సబ్-4 మీటర్(4 మీటర్ల లోపు పొడవు) కేటగిరీ కార్లకు డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. తక్కువ ధర, అదిరిపోయే లుక్, సిటీ రోడ్లపై ఈజీగా డ్రైవ్ చేసే వెసులుబాటు ఉండటంతో టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే 2026-27 కాలంలో ఈ సెగ్మెంట్లో మరిన్ని కొత్త కార్లు సందడి చేయబోతున్నాయి. పాత కార్ల అప్‌డేటెడ్ వెర్షన్లతో పాటు, సరికొత్త మోడళ్లు కూడా క్యూ కడుతున్నాయి.

మారుతి సుజుకి బ్రెజా ఫేస్‌లిఫ్ట్

భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీల్లో బ్రెజా ఒకటి. ఇప్పుడు మారుతి సుజుకి దీనిని మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ ఇంజిన్ స్థానంలో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల కారు వేగం పెరగడమే కాకుండా మైలేజీ కూడా మెరుగుపడనుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభించనుంది. కొత్త బ్రెజా లుక్ కూడా మరింత షార్ప్‌గా ఉండబోతోందని సమాచారం.

రెనాల్ట్ బ్రిజ్జర్

రెనాల్ట్ కంపెనీ మార్చి 10న తన సరికొత్త బ్రిజ్జర్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇది చూడటానికి చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండటమే కాకుండా మహీంద్రా థార్, మారుతి జిమ్నీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను వాడబోతున్నారు, ఇది సుమారు 100 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. తక్కువ పొడవులో ఎక్కువ పవర్ కోరుకునే అడ్వెంచర్ ప్రియులకు ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.

మహీంద్రా విజన్ ఎక్స్

మహీంద్రా తన ఎలక్ట్రిక్, ఐసీఈ లైనప్‌లో విజన్ ఎక్స్ అనే సరికొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. ఇది మహీంద్రా కొత్త NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. దీని డిజైన్ XEV 9eని పోలి ఉండి, చాలా మోడరన్‌గా కనిపిస్తుంది. ఇది మార్కెట్లోకి వస్తే టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్ల ఆధిపత్యానికి బ్రేక్ వేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్

స్కోడా తన కైలాక్ మోడల్‌లో స్పోర్ట్‌లైన్ అనే సరికొత్త ట్రిమ్‌ను ఈ ఏడాది చివరలో లాంచ్ చేయనుంది. ఇది చూడటానికి చాలా స్పోర్టీగా, బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్‌తో అదిరిపోయే లుక్‌లో ఉంటుంది. కారు లోపల కూడా స్పోర్టీ ఇంటీరియర్ థీమ్ ఉండబోతోంది. ప్రీమియం ఎస్‌యూవీ అనుభూతిని కోరుకునే వారికి స్కోడా ఈ ఆప్షన్ ఇస్తోంది.

విన్‌ఫాస్ట్ VF3

వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్ కూడా భారత్‌లోకి అడుగుపెడుతోంది. వారి మొదటి మోడల్ VF3 ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి టాల్ బాయ్ డిజైన్‌తో ఉండి, 191 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ ఇచ్చే ఈ కారు, బడ్జెట్ ఈవీ ప్రియులకు ఒక గొప్ప వరం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story