Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త జనరేషన్ రోడ్‌స్టర్ లాంచ్ తేదీ ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే అక్టోబర్ 1, 2026న ఈ సూపర్‌కార్‌ను ప్రపంచం ముందు ఆవిష్కరించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా గో ఫర్ లాంచ్ అనే క్యాప్షన్‌తో పాటు అక్టోబర్ 1వ తేదీని సూచించే 10.01 టీజర్‌ను టెస్లా విడుదల చేసింది. ఈ కారుకు సంబంధించిన రేంజ్, టాప్ స్పీడ్, స్పేస్‌ఎక్స్ టెక్నాలజీ ఆధారిత థ్రస్టర్ ఫీచర్‌పై మార్కెట్లో విపరీతమైన చర్చ జరుగుతోంది.

టెస్లా తన రెండో తరానికి చెందిన ఈ రోడ్‌స్టర్‌ను తొలిసారిగా నవంబర్ 2017లోనే ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సమయంలోనే ఇది అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్‌గా ఉంటుందని ప్రకటించారు. వాస్తవానికి ఈ కారును 2020 నాటికి కస్టమర్లకు అందించాలని ప్రణాళిక వేసినప్పటికీ, వివిధ కారణాల వల్ల లాంచ్ డేట్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు అక్టోబర్ 1న ఈ అద్భుతమైన వాహనం రోడ్డెక్కడానికి సిద్ధమవుతోంది.

2017లో రోడ్‌స్టర్‌ను ప్రదర్శించినప్పుడు, ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 620 మైళ్లకు పైగా (దాదాపు 998 కిలోమీటర్లు) ప్రయాణించగలదని టెస్లా స్పష్టం చేసింది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రేంజ్‌ను 1,000 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. అయితే, అక్టోబర్ 1న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో ఈ కారుకు సంబంధించిన తుది స్పెసిఫికేషన్లు, బ్యాటరీ సామర్థ్యంపై పూర్తి స్పష్టత రానుంది.

ఈ కారు వేగమే దీనికి అతిపెద్ద హైలైట్ అని చెప్పవచ్చు. 2017లో టెస్లా తెలిపిన వివరాల ప్రకారం, ఈ కారు కేవలం 1.9 సెకన్లలోనే 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే దీని టాప్ స్పీడు గంటకు 250 మైళ్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రస్తుత వెబ్‌సైట్ అప్‌డేట్స్ ప్రకారం 0-100 కి.మీ వేగాన్ని 2.1 సెకన్లలోనే అందుకోగలదని, గరిష్ట వేగం గంటకు 400 కి.మీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ఈ కొత్త టీజర్‌లో కారు వెనుక భాగం నుంచి గ్యాస్ రిలీజ్ అవుతున్నట్లు చూపించడం స్పేస్‌ఎక్స్ కోల్డ్-గ్యాస్ థ్రస్టర్స్ టెక్నాలజీని పోలి ఉంది. ఎలన్ మస్క్ గతంలోనే ఈ ఫీచర్ గురించి ప్రస్తావించగా, ఇది సాధారణ మోడల్‌లో వస్తుందా లేక ప్రత్యేక వేరియంట్‌లో ఇస్తారా అనేది లాంచ్ రోజే తెలియనుంది.

Next Story