Toyota Fortuner: 10 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో టయోటా ఫార్చ్యూనర్.. డిసెంబర్ 1న ఆవిష్కరణ
డిసెంబర్ 1న ఆవిష్కరణ

Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ కొనాలని కలలు కనేవారికి ఇది నిజంగా పండుగ లాంటి వార్తే. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టయోటా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీని పూర్తిగా కొత్త జనరేషన్ అవతారంలో తీసుకురాబోతోంది. వచ్చే వారం అంటే డిసెంబర్ 1, 2026న దక్షిణాఫ్రికా వేదికగా కొత్త ఫార్చ్యూనర్ గ్లోబల్ డెబ్యూ జరగనుంది. ఆ తర్వాత 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలోనూ దీన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కొత్త డిజైన్, భారీ స్క్రీన్లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఈ ఎస్యూవీ సరికొత్తగా మెరవనుంది.
హెలక్స్, 4రన్నర్ స్ఫూర్తితో మరింత గంభీరమైన లుక్
కొత్త ఫార్చ్యూనర్ బయటి రూపంలో భారీ మార్పులు కనిపించనున్నాయి. టయోటాకు చెందిన కొత్త హైలక్స్, గ్లోబల్ ఎస్యూవీ 4రన్నర్ తరహాలో దీని డిజైన్ ఉండొచ్చని అంచనా. ముందు భాగం మునుపటి కంటే మరింత వెడల్పుగా, నిటారుగా కనిపిస్తుంది. ఫ్లాట్ బానెట్, పెద్ద మెష్ గ్రిల్, సన్నని డీఆర్ఎల్స్తో కూడిన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్లైట్లు కారుకు రఫ్ అండ్ టఫ్ లుక్‌ను తెస్తాయి. వెనుక భాగంలోనూ కొత్త సన్నని ఎల్ఈడీ టెయిల్ లైట్లు, మారిన టెయిల్‌గేట్, కొత్త బంపర్‌తో ఫార్చ్యూనర్ మరింత ఆధునికంగా కనిపించనుంది.
క్యాబిన్లో రెండు 12.3 అంగుళాల స్క్రీన్లు
ఇప్పటివరకు ఫార్చ్యూనర్ ఇంటీరియర్ పాతదిగా ఉందన్న విమర్శలకు టయోటా చెక్ పెట్టనుంది. లోపల సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు వెంటిలేటెడ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ కలిగిన ఫ్రంట్ సీట్లు, పార్కింగ్‌ను సులభతరం చేసే 360-డిగ్రీ కెమెరా రానున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం 'టయోటా సేఫ్టీ సెన్స్' కింద లెవల్-2 అడాస్ (ADAS) ఫీచర్లు కూడా జతచేయనున్నట్లు తెలుస్తోంది.
డీజిల్ ఇంజిన్‌తో 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ
కొత్త హెలక్స్ను తయారు చేసిన అప్డేటెడ్ IMV ల్యాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పైనే కొత్త ఫార్చ్యూనర్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఇంజిన్ విషయంలో ప్రస్తుత 2.8-లీటర్ టర్బో డీజిల్, 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించవచ్చు. అయితే ఇందులో ఉన్న అసలైన ప్రత్యేకత ఏమిటంటే, డీజిల్ ఇంజిన్‌కు 48V నియో డ్రైవ్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ జతచేయనున్నారు. ఇది ఇంజిన్‌కు అదనపు శక్తిని ఇవ్వడమే కాకుండా మైలేజీని మెరుగుపరుస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు ఆఫ్-రోడింగ్ కోసం లో-రేంజ్ 4WD సిస్టమ్ యథావిధిగా ఉంటాయి.
భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
కొత్త జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ 2027లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అంతకుముందే 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దీన్ని భారతీయ కస్టమర్లకు చూపించనున్నారు. అయితే మన దేశంలో ఏయే ఇంజిన్ ఆప్షన్లు ఇస్తారు, ధర ఎంత ఉంటుంది, కచ్చితమైన లాంచ్ తేదీ ఏంటనే విషయాలపై టయోటా ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

