Toyota Hilux : ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా భారత మార్కెట్లోకి తన పాపులర్ లైఫ్‌స్టైల్ పిక్అప్ ట్రక్ టయోటా హైలక్స్ సరికొత్త మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త పిక్అప్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 31.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఇంటీరియర్, సరికొత్త టెక్నాలజీ ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు. ఎంతటి కఠినమైన రోడ్లపై అయినా నడిపేందుకు వీలుగా దీని ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దారు.

మరింత మస్కులర్ డిజైన్, బాడీ లుక్

కొత్త టయోటా హైలక్స్ వెలుపలి డిజైన్ చూస్తే మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇందులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టైలిష్ బంపర్, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, మరింత దృఢమైన మస్కులర్ ఫెండర్లు అందించారు. కారు పొడవు, వెడల్పు, ఎత్తులలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, దీని కార్గో బెడ్‌లో ఏకంగా 500 కిలోల బరువు వరకు మోసుకెళ్లే వెసులుబాటు ఉంది. బరువులను సులభంగా ఎక్కించడానికి, దించడానికి అనువుగా లోడ్ బెడ్ ఇరువైపులా కొత్త డెక్ స్టెప్స్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది.

లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు

హైలక్స్ కేబిన్‌ను ఎంతో ప్రీమియమ్‌గా డిజైన్ చేశారు. సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్‌తో పాటు, 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్‌తో కూడిన 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏసీ కంట్రోల్స్, ఇతర ముఖ్యమైన బటన్లను స్క్రీన్ నుంచి వేరుగా ఉంచారు. ఈ కారు ఆటిట్యూడ్ బ్లాక్, ఎమోషనల్ రెడ్, యాష్, సూపర్ వైట్, సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్ మెటాలిక్ అనే ఆరు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్, ప్రదర్శన

సాంకేతిక వివరాల్లోకి వెళితే.. కొత్త హైలక్స్‌లో దృఢమైన లాడర్-ఫ్రేమ్ ఛాసిస్, 4-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్‌ను కొనసాగించారు. దీనికి అదనంగా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, మెరుగైన సస్పెన్షన్, మల్టీ-టెర్రైన్ సెలెక్ట్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఇందులో లభించే 2.8-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ 201bhp పవర్, 500Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. కంపెనీ ఈ కారును GX, VX అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో GX వేరియంట్ 4x2 మరియు 4x4 రెండింటిలోనూ లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story