Hyundai Creta : కంప్లీట్ న్యూ లుక్‌లో 2027 హ్యుందాయ్ క్రెటా.. తొలిసారిగా హైబ్రిడ్ ఇంజిన్‌తో ఎంట్రీ
తొలిసారిగా హైబ్రిడ్ ఇంజిన్‌తో ఎంట్రీ

Hyundai Creta : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా త్వరలోనే సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ తమ నెక్స్ట్ జనరేషన్ 2027 హ్యుందాయ్ క్రెటా మోడల్‌పై శరవేగంగా పనిచేస్తోంది. ఈ కొత్త వర్షన్‌ను భారత్ మోబిలిటీ ఎక్స్‌పో వేదికగా తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత దీనిని భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. కొత్త క్రెటా డిజైన్, ఫీచర్లు, సెక్యూరిటీ, ఇంజిన్ విభాగాల్లో భారీ మార్పులతో రాబోతోంది.
ఆధునిక డిజైన్, కొత్త K3 ప్లాట్‌ఫారమ్
నూతన 2027 హ్యుందాయ్ క్రెటా మునుపటి మోడల్ కంటే చాలా భిన్నంగా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. రోడ్డు టెస్టింగ్ సమయాల్లో కనిపించిన ఫోటోల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ సైజ్ పాత మోడల్ కంటే పెద్దదిగా ఉండబోతోంది. దీని పొడవు, వెడల్పు పెరగడం వల్ల కారు లోపల ప్రయాణించే వారికి మునుపటి కంటే చాలా ఎక్కువ స్పేస్, సౌకర్యం లభిస్తాయి. అంతేకాకుండా, ఈ కారును హ్యుందాయ్ నూతన K3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. దీనివల్ల కారు బాడీ నిర్మాణం మరింత బలంగా మారి, వాహనదారుల భద్రత మెరుగుపడుతుంది.
ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లు
ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. కొత్త క్రెటాలో స్ట్రెయిట్ రూఫ్‌లైన్, నూతన స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు కనెక్టెడ్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, పెద్ద సైజ్ అలాయ్ వీల్స్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇంటీరియర్ కేబిన్‌లో కూడా భారీ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇందులో పెద్ద పరిమాణంలో ఉండే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాయిస్ కమాండ్ సిస్టమ్, అప్‌డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లభిస్తాయి. సీట్ల నాణ్యతతో పాటు వెనుక ప్రయాణికులకు ఎక్కువ లెగ్‌రూమ్ ఉండేలా డిజైన్ చేశారు. సెక్యూరిటీ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా సమకూర్చనున్నారు.
తొలిసారిగా 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్
ఈ కొత్త క్రెటాలో అత్యంత కీలకమైన మార్పు ఇంజిన్ విభాగంలో జరగనుంది. హ్యుందాయ్ సంస్థ తొలిసారిగా క్రెటాలో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేయబోతోంది. నూతన 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ అత్యుత్తమ మైలేజ్ ఇస్తూ, ఇంధన ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. దీంతోపాటుగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఇంజిన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తాయి.

