Hyundai Creta 2027 : భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు మరింత అధునాతనంగా మారబోతోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన నెక్స్ట్ జనరేషన్ 2027 హ్యుందాయ్ క్రెటా మోడల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. మీడియా రిపోర్ట్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త క్రెటా మోడల్ పాత దానికంటే ఎంతో వినూత్నమైన డిజైన్, మైండ్ బ్లాక్ చేసే టెక్నాలజీ అప్‌గ్రేడ్స్, సరికొత్త పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో రానుంది.

కళ్లు చెదిరే లగ్జరీ ఇంటీరియర్, ఏఐ టెక్నాలజీ

కొత్త 2027 హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ విషయంలో కంపెనీ సరికొత్త లగ్జరీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. ఈ కారు బ్రాండ్ సరికొత్త ప్లీఓస్ కనెక్ట్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది. ఇందులో మధ్యభాగంలో ఒక భారీ సెంటర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ కోసం ప్రత్యేకంగా ఒక స్లిమ్ డిస్‌ప్లేను అమర్చారు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. ఇందులో ఇన్-బిల్ట్‌గా గ్లీఓ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనితో పాటు అప్‌గ్రేడ్ చేసిన ఏడీఏఎస్ సేఫ్టీ సూట్, సరికొత్త ప్రీమియం అప్హోల్స్టరీ, రీడిజైన్ చేసిన డోర్ ట్రిమ్స్, వెనుక సీట్ల ప్రయాణికుల కోసం అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు ఇందులో ఉండనున్నాయి.

రూపురేఖలు మార్చేస్తున్న షార్ప్ డిజైన్

ఇటీవల టెస్టింగ్ సమయంలో దొరికిన క్రెటా మోడల్‌ను పరిశీలిస్తే.. అందులో కొత్తగా డిజైన్ చేసిన 19 ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ 2027 క్రెటా మోడల్ మునుపటి కంటే చాలా షార్ప్ మరియు స్పోర్టీ లుక్‌తో కనిపిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ కార్ల స్ఫూర్తితో రూపొందించిన సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కంటి బొమ్మల ఆకారంలో ఉండే ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. దీనితో పాటు ముందు మరియు వెనుక బంపర్లను కూడా సరికొత్తగా మోడిఫై చేశారు.

సరికొత్త కే3 ప్లాట్‌ఫామ్‌తో పెరగనున్న సైజ్

తన సిస్టర్ బ్రాండ్ అయిన కియా సెల్టోస్ నెక్స్ట్ జనరేషన్ లాగే, ఈ 2027 హ్యుందాయ్ క్రెటాను కూడా సరికొత్త కే3 ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఈ అధునాతన ఆర్కిటెక్చర్ వల్ల కారు ఓవరాల్ సైజును, వెడల్పును భారీగా పెంచడానికి వీలవుతుంది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న క్రెటా మోడల్ కంటే ఈ 2027 వెర్షన్ పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ విపరీతంగా పెరుగుతుంది, ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు అద్భుతమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభించి ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా మారనుంది.

సంచలనం సృష్టించబోతున్న 1.2 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్

ఈ నెక్స్ట్ జనరేషన్ క్రెటాలో రాబోతున్న బిగ్గెస్ట్ మెకానికల్ అప్‌గ్రేడ్ ఏంటంటే.. ఇందులో సరికొత్త 1.2 TGDi పెట్రోల్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఇంజన్‌ను పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్ సంస్థ అంతర్జాతీయ మార్కెట్ కోసం సరికొత్త 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను డెవలప్ చేస్తోంది, దీనిని 2026 లో రాబోయే హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీలో మొదటగా వాడనున్నారు. ఈ ఇంజన్ పూర్తిగా హైబ్రిడ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, భవిష్యత్తులో హ్యుందాయ్ లాంచ్ చేయబోయే అన్ని హైబ్రిడ్ వాహనాల్లోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల క్రెటా కారు మైలేజ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాత ఇంజన్ ఆప్షన్లు కూడా కంటిన్యూ

సరికొత్త హైబ్రిడ్ ఇంజన్ వస్తున్నప్పటికీ.. పాత మోడల్స్ ఇష్టపడే కస్టమర్ల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజన్ ఆప్షన్లను కూడా హ్యుందాయ్ అలాగే కొనసాగించనుంది. ఇందులో 115 bhp పవర్ ఇచ్చే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 160 bhp పవర్ ఇచ్చే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మైలేజ్ లవర్స్ కోసం 116 bhp పవర్ ఇచ్చే 1.5 లీటర్ డిజిల్ ఇంజన్లు యథావిధిగా లభిస్తాయి. వీటికి సంబంధించిన మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. 2027లో లాంచ్ కాబోయే ఈ కారు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story