Hyundai Creta : నెక్స్ట్ జనరేషన్ క్రెటా ఇంటీరియర్ లీక్..లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా మార్పులు
లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా మార్పులు

Hyundai Creta :భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా త్వరలో సరికొత్త రూపంలో మన ముందుకు రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ సంచలనాలు సృష్టిస్తుండగానే, హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ క్రెటా టెస్టింగ్‌ను వేగవంతం చేసింది. ఇటీవల దక్షిణ కొరియా వీధుల్లో ఈ కారు పరీక్షిస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కేవలం బయటి రూపమే కాదు, కారు లోపలి భాగం కూడా పూర్తిగా మారిపోబోతున్నట్లు ఈ స్పై ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను బట్టి చూస్తే, కొత్త క్రెటా ఇంటీరియర్ మునుపటి కంటే చాలా ప్రీమియంగా ఉండబోతోంది. కారు లోపల డోర్ హ్యాండిల్స్ డిజైన్ నుంచి అప్హోల్స్టరీ వరకు ప్రతిదీ కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా నలుపు రంగు లెదర్ సీట్లు ఈ కారుకు మరింత క్లాసిక్ లుక్ ఇస్తున్నాయి. ఈ కారులోని హెడ్‌రెస్ట్ డిజైన్ ఇటీవల లాంచ్ అయిన కొత్త కియా సెల్టోస్‌ను పోలి ఉండటం గమనార్హం. డ్యాష్‌బోర్డ్ ఇంకా ముసుగులోనే ఉన్నప్పటికీ, హ్యుందాయ్ తన గ్లోబల్ మోడల్స్‌లో వాడుతున్న హారిజాంటల్ లేఅవుట్ నే ఇందులోనూ ఇచ్చే అవకాశం ఉంది. అంటే లోపల స్క్రీన్లు, బటన్లు చాలా నీట్‌గా, మోడ్రన్‌గా అమర్చబడి ఉంటాయి.
ఈ కొత్త మోడల్‌లో వెనుక ప్రయాణించే వారికి హ్యుందాయ్ పెద్ద పీట వేసింది. కారు వీల్‌బేస్‌ను పెంచడం ద్వారా వెనుక వైపు లెగ్‌రూమ్ గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. దీనివల్ల పొడవుగా ఉండేవారు కూడా చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అంతేకాకుండా, వెనుక సీట్లో కూర్చునే ముగ్గురు ప్రయాణికులకు విడివిడిగా అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్ ఇచ్చారు. ఇది కేవలం సౌకర్యాన్నే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు మెడకు రక్షణ కూడా ఇస్తుంది. వెనుక ఉన్న ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మారిందని, ఇది క్యాబిన్‌ను మరింత వేగంగా చల్లబరుస్తుందని తెలుస్తోంది.
కారు వెలుపలి డిజైన్ గురించి చెప్పాలంటే.. ఇది ఇప్పుడు మరింత ఎత్తుగా, వెడల్పుగా కనిపిస్తోంది. ఇది కేవలం చిన్నపాటి మార్పు కాదని, పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ మీద తయారవుతున్న మోడల్ అని నిపుణులు చెబుతున్నారు. కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్, షార్ప్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కారు బాడీలో హై-స్ట్రెంత్ స్టీల్ వాడటం వల్ల క్రష్ సేఫ్టీ కూడా మెరుగుపడనుంది. అంటే ఈసారి క్రెటా భద్రత విషయంలో 5-స్టార్ రేటింగ్ లక్ష్యంగా వస్తోంది.
ఫీచర్ల పరంగా ఈ ఎస్‌యూవీ ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. ఇందులో మునుపటి కంటే పెద్ద టచ్‌స్క్రీన్, అప్‌గ్రేడ్ చేసిన అడాస్ టెక్నాలజీ, మెరుగైన కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజన్ పరంగా కూడా కొన్ని కీలక మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా హైబ్రిడ్ ఆప్షన్ లేదా మరింత పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను మనం ఆశించవచ్చు. 2026 నాటికి ఈ కొత్త జనరేషన్ క్రెటా భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రత్యర్థులకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

