Hyundai : లాంచ్ డేట్ వచ్చేసింది.. హ్యాందాయ్ కొత్త ఎస్యూవీ వచ్చేది ఎప్పుడంటే
హ్యాందాయ్ కొత్త ఎస్యూవీ వచ్చేది ఎప్పుడంటే

Hyundai : హ్యుందాయ్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ అక్టోబర్ 24న ఒక కొత్త కారును లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇది నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ వెన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త వెన్యూ లాంచ్‌తో ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి కార్లకు పోటీ ఎదురుకానుంది.
కొత్త హ్యుందాయ్ వెన్యూ దాని పాత బాక్సీ డిజైన్‌ను కొనసాగిస్తూనే, అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లతో రానుంది. ఇందులో స్ప్లిట్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్,హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. అయితే ఇది పాత మోడల్ కంటే మరింత స్క్వేర్ షేపులో ఉంటుంది. ఈ డిజైన్ హ్యుందాయ్ ఎక్స్‌టర్, అల్కాజార్ మోడల్స్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తోంది. కొత్తగా ముందు భాగంలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో, కొత్త అల్లాయ్ వీల్స్, మరింత బ్లాక్ క్లాడింగ్, ఎంగ్యులర్ ఓఆర్వీఎమ్ లు ఉంటాయి. వెనుక వైపున, కొత్త వెన్యూలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్-ల్యాంప్స్, సిల్వర్ ఫినిష్‌తో కూడిన బంపర్, బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా ఉండవచ్చు.
నెక్స్ట్-జెన్ వెన్యూ లోపలి భాగంలో కూడా చాలా మార్పులు రానున్నాయి. దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా ప్యాకేజ్, ముందు వైపున వెంటిలేటెడ్ సీట్లు, కొత్త హ్యుందాయ్ మోడల్స్ మాదిరిగా పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, లెవల్ 1 ఏడీఏఎస్ ప్యాకేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడీఏఎస్ ప్యాకేజ్‌లో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉండవచ్చు.
కొత్త వెన్యూలో ప్రస్తుతం ఉన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లే కొనసాగవచ్చు. అవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83 పీఎస్ పవర్, 114 ఎన్ఎమ్ టార్క్), 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (120 పీఎస్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్), 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (116 పీఎస్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్) ఉండనున్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, కొన్ని వేరియంట్‌లకు 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఉండవచ్చు. కొత్త ఫీచర్లు, డిజైన్‌తో నెక్స్ట్-జెన్ వెన్యూ మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ పోటీదారుగా నిలుస్తుందని భావించవచ్చు.
