Kia : కియా సోనెట్ నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ రివీల్.. 2027లో కొత్త అవతారంలోకి రానున్న పాపులర్ ఎస్‌యూవీ
2027లో కొత్త అవతారంలోకి రానున్న పాపులర్ ఎస్‌యూవీ

Kia : దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్, భారతీయ రోడ్ల మీద తన సత్తా చాటుతున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సోనెట్ విషయంలో ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. 2020లో అరంగేట్రం చేసినప్పటి నుంచి తన మోడ్రన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న సోనెట్, ఇప్పుడు తన నెక్స్ట్ జనరేషన్ మోడల్‌తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రెడీ అవుతోంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా వంటి హేమాహేమీలకు గట్టి పోటీ ఇచ్చేలా 2027లో ఈ సరికొత్త సోనెట్ మార్కెట్లోకి రానుంది.
రాబోయే కొత్త కియా సోనెట్ ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ కంటే బలమైన K1 ప్లాట్‌ఫారమ్ అప్‌డేటెడ్ వెర్షన్‌పై ఆధారపడి ఉంటుంది. కియా సైరోస్‌లో కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు. దీనివల్ల కారు స్ట్రక్చర్ మరింత ధృడంగా మారుతుంది, తద్వారా క్రాష్ సేఫ్టీ టెస్టుల్లో మెరుగైన రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, దీని వీల్‌బేస్ మరో 20 మిమీ పెరగనుంది. దీనివల్ల వెనుక కూర్చునే ప్రయాణికులకు ఎక్కువ లెగ్ రూమ్ మరియు విశాలమైన కేబిన్ స్పేస్ లభిస్తుంది.
కొత్త జనరేషన్ సోనెట్‌లో టెక్నాలజీకి పెద్దపీట వేయనున్నారు. ఇందులో OTA (ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. డాష్‌బోర్డ్ డిజైన్ పూర్తిగా మారిపోవడమే కాకుండా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీలో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. లుక్ పరంగా కూడా కియా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరిస్తూ, మరింత షార్ప్, అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్స్‌తో ఈ కారు రాబోతోంది.
ఇంజన్ విషయంలో కియా ప్రస్తుతమున్న నమ్మకమైన ఆప్షన్లనే కొనసాగించనుంది. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్,1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ కొత్త సోనెట్ లాంచ్ అయిన ఏడాది లేదా రెండేళ్ల తర్వాత, అంటే 2028 లేదా 2029 నాటికి స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ సోనెట్ హైబ్రిడ్ వస్తే, మైలేజీ విషయంలో ఈ సెగ్మెంట్‌లో రికార్డులు సృష్టించడం ఖాయం.

