Tata Nexon: టాటా నెట్వర్క్ నుంచి మరో సెన్సేషన్.. 2027 టాటా నెక్సాన్ కొత్త రూపం
2027 టాటా నెక్సాన్ కొత్త రూపం

Tata Nexon: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీ త్వరలోనే సరికొత్త అవతారంలో అలరించబోతోంది. గరుడ అనే అంతర్గత కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నెక్స్ట్ జెనరేషన్ మోడల్ 2027లో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ కారు వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2027 టాటా నెక్సాన్ మోడల్‌లో అత్యంత కీలకమైన మార్పు దాని ప్లాట్‌ఫామ్ రూపంలో రాబోతోంది. టాటా కర్వ్ కారులో ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ అట్లాస్ ఆర్కిటెక్చర్‌పై ఈ ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్, క్లౌడ్ కనెక్టివిటీ టెక్నాలజీకి అనుగుణంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీనివల్ల కారు ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారడమే కాకుండా వాహన దృఢత్వం గణనీయంగా పెరుగుతుంది.
రోడ్డుపైకి వస్తే గుర్తించలేనంతగా మారనున్న లుక్స్
ఇప్పటికే రహదారులపై జరుగుతున్న టెస్టింగ్ ఆధారంగా చూస్తే ఈ కొత్త నెక్సాన్ డిజైన్‌లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ముందరి భాగంలో కొత్త గ్రిల్, అధునాతన హెడ్‌లాంప్స్, నయా బంపర్ ఆకట్టుకోనున్నాయి. సరికొత్త డిజైన్ అలాయ్ వీల్స్, వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త ఎస్‌యూవీ మరింత లగ్జరీగా కనిపించనుంది.
హైటెక్ ఫీచర్లు.. కేబిన్ లోపల భారీ అప్‌గ్రేడ్లు
కారు లోపల అడుగుపెడితే సరికొత్త ప్రపంచం కనిపిస్తుంది. భారీ పరిమాణంలో ఉండే డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అమర్చనున్నారు. భద్రతకు పెద్దపీట వేస్తూ లెవెల్ 2 అడాస్ టెక్నాలజీని ఇందులో జోడించబోతున్నారు. 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన సౌకర్యాలు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
ఇంజన్ విషయంలో మార్పులు లేవు
డిజైన్, టెక్నాలజీ పరంగా భారీ మార్పులు ఉన్నప్పటికీ ఇంజన్ విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఉంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లు మేన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించనున్నాయి. నెక్సాన్ ఈ-సిఎన్‌జీ మోడల్‌లో కారు అడుగుభాగంలో అమర్చే సిఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని అందించనున్నారు. ఇది కిలోకు సుమారు 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.

