Toyota Fortuner : ఎస్‌యూవీ రారాజు ఫార్చ్యూనర్ కొత్త అవతారం.. మూడవ తరం మోడల్ లాంచ్ డేట్ వచ్చేసింది
మూడవ తరం మోడల్ లాంచ్ డేట్ వచ్చేసింది

Toyota Fortuner : భారతదేశపు అత్యంత పవర్ఫుల్, క్రేజీ ఎస్‌యూవీలలో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు తన మూడవ తరం మోడల్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. భారీ కాస్మెటిక్ మార్పులు, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ సరికొత్త ఫార్చ్యూనర్ టెస్టింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఈ కారు భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఫార్చ్యూనర్ ప్రియులను ఉర్రూతలూగించే ఆ సరికొత్త విశేషాలేంటో వివరంగా చూద్దాం.
సరికొత్త ఫార్చ్యూనర్ తన పాత సిల్హౌట్‌ను కాపాడుకుంటూనే, మరింత గంభీరమైన లుక్ కోసం కొన్ని మార్పులు చేసుకుంది. ముందటి కంటే విశాలమైన గ్రిల్, కిందకి అమర్చిన హెడ్ లైట్ క్లస్టర్, ఫ్లాట్ బోనెట్ దీనికి మరింత మాసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా హైలక్స్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తున్నాయి. కొత్త బంపర్ డిజైన్, స్లీక్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్తో ఈ కారు రోడ్డుపై రాజసం ఉట్టిపడేలా ఉండబోతోంది. వెనుక వైపు సన్నని టెయిల్ ల్యాంప్స్, మోడిఫైడ్ బంపర్ కూడా వచ్చే అవకాశం ఉంది.
లోపల క్యాబిన్ విషయంలో టయోటా పెద్ద అప్‌గ్రేడ్ ఇస్తోంది. కొత్త ఫార్చ్యూనర్‌లో 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిస్థాయి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉండబోతున్నాయి. మొదటిసారిగా ఫార్చ్యూనర్‌లో సన్‌రూఫ్ (బహుశా పనోరమిక్), వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లను ఆశించవచ్చు. అంటే పవర్‌ఫుల్ అడ్వెంచర్ తో పాటు లగ్జరీ అనుభవం కూడా తోడవుతుంది. అదనంగా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం.
2026 ఫార్చ్యూనర్‌లో ప్రస్తుతం ఉన్న 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్లను అలాగే కొనసాగించబోతున్నారు. పెట్రోల్ ఇంజిన్ 164 hp పవర్ ఇస్తుండగా, డీజిల్ ఇంజిన్ 201 hp పవర్, గరిష్టంగా 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈసారి హైలైట్ ఏంటంటే.. ఇందులో 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా రాబోతోంది. దీనివల్ల భారీగా మైలేజీ పెరగడమే కాకుండా, పర్ఫార్మెన్స్ కూడా మరింత స్మూత్‌గా ఉంటుంది. ఇది ఎప్పటిలాగే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడుతుంది.
ఎస్‌యూవీ విభాగంలో ఫార్చ్యూనర్ అనేది ఒక ఎమోషన్. కొత్త తరం మోడల్ రాకతో ఈ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, మోడరన్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు ఎండీవర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. ధర విషయంలో ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు కానీ, ఫీచర్లు మరియు పెర్ఫార్మెన్స్ చూస్తే ఆ రేటు తక్కువే అనిపిస్తుంది.

