డిసెంబర్ 18న లాంచ్

Nissan : భారతీయ మార్కెట్‌లో తన వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్ కంపెనీ భారీగా సిద్ధమవుతోంది. భారత దేశం కోసం ఒక సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీని విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని లాంచ్ తేదీ డిసెంబర్ 18, 2025 గా నిర్ణయించబడింది. ఈ రాబోయే మోడల్ దేశవ్యాప్తంగా అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు రెనాల్ట్ ట్రైబర్‎తో ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటుంది.

కైగర్-మాగ్నైట్ తర్వాత, రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ నుంచి వస్తున్న రెండవ బ్యాడ్జ్-ఇంజినీర్డ్ ఉత్పత్తి ఇదే కానుంది. ఈ అరంగేట్రంతో నిస్సాన్ కొత్త బ్రాండ్ గుర్తింపు, మరింత ఫీచర్-రిచ్ మోడల్‌తో సబ్-కాంపాక్ట్ ఎంపీవీ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. భారత మార్కెట్‌లో ఇది మారుతి ఎర్టిగా, కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

గతంలో లీకైన స్పై షాట్‌లు ఈ కొత్త ఎంపీవీ డిజైన్ దిశను స్పష్టంగా సూచిస్తున్నాయి. ఓవరాల్ సిల్హౌట్ ట్రైబర్ ను పోలి ఉన్నప్పటికీ నిస్సాన్ ముందు భాగంలో (ఫ్రంట్ ఫేసియా) గణనీయమైన మార్పులు చేసింది. ఈ ఎంపీవీలో షట్కోణపు ఇన్సర్ట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్లు, మరింత ఆకర్షణీయమైన, మోడ్రన్ లుక్ ఇచ్చేందుకు ఫ్రంట్ బంపర్‌లో పొందుపర్చిన C-ఆకారపు యాక్సెంట్‌లు ఉంటాయి.

ఈ కొత్త మోడల్‌లో ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఇస్తున్నారు. ఇది దీని రెనాల్ట్ సిస్టమ్ మోడల్ నుంచి విభిన్నంగా కనిపించడానికి సహాయపడుతుంది. వెనుక బంపర్, టెయిల్-ల్యాంప్ డిటైలింగ్‌లో కూడా చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ ఎంపీవీ ఇంటీరియర్ ఇంకా అధికారికంగా బయటకు రానప్పటికీ, ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటున్నందున, లేఅవుట్ చాలావరకు ట్రైబర్ మాదిరిగానే ఉండవచ్చు. అయినప్పటికీ, నిస్సాన్ ప్రత్యేక గుర్తింపు కోసం బ్రాండ్‌కు ప్రత్యేకమైన టచ్‌లను ఇవ్వనుంది.

ఇందులో 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ సెంటర్ స్టోరేజ్, స్లైడింగ్/రిక్లైనింగ్ ఫీచర్ ఉన్న సెకండ్-రో సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఎంపీవీలో మాడ్యులర్ త్రీ-రో సీటింగ్ లేఅవుట్ కూడా ఉంటుంది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 5, 6, లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో మార్చుకోవచ్చు.

కొత్త నిస్సాన్ ఎంపీవీలో ఇప్పటికే ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ నే ఉంటుంది. ఇది 72 hp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ట్రైబర్ మాదిరిగానే 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ధరల విషయంలో పోటీతత్వాన్ని కొనసాగించడానికి మెకానికల్ ప్యాకేజీలో పెద్దగా మార్పులు చేయకపోయినా, మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం నిస్సాన్ ఇంజిన్, గేర్‌బాక్స్‌ను ట్యూన్ చేయవచ్చు. ఈ నిస్సాన్ ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగానే దాదాపు రూ.5.76 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది తక్కువ ధరలో పెద్ద, ఫ్లెక్సిబుల్ 7-సీటర్ కారును కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story