Nissan Gravite : నిస్సాన్ గ్రావిటేకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 17న గ్రాండ్ ఎంట్రీ
ఫిబ్రవరి 17న గ్రాండ్ ఎంట్రీ

Nissan Gravite :నిస్సాన్ ఇండియా తన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ గ్రావిటె లాంచ్ డేట్‌ను ఎట్టకేలకు ఖరారు చేసింది. ఫిబ్రవరి 17న ఈ కారు భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో లగ్జరీ, స్పేస్‌ను అందించడానికి వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, రంగుల వివరాలు కారుపై భారీ అంచనాలను పెంచేశాయి.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఉనికిని మరింత చాటుకునేందుకు నిస్సాన్ ఇండియా సరికొత్త గ్రావిటే ఎంపీవీని సిద్ధం చేసింది. నిజానికి ఈ కారు జనవరి 21నే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 17కు వాయిదా పడింది. నిస్సాన్ తన కొత్త ప్రొడక్ట్ స్ట్రాటజీలో భాగంగా భారత్ లో లాంచ్ చేస్తున్న మొట్టమొదటి 7-సీటర్ కారు ఇదే కావడం విశేషం. ఈ కారు మార్చి నెల నుంచి కస్టమర్లకు డెలివరీ కానుంది. నిస్సాన్ మ్యాగ్నైట్ మాదిరిగానే గ్రావిటే కూడా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే వాల్యూ ఫర్ మనీ కారుగా నిలవనుంది.
డిజైన్ విషయానికి వస్తే.. గ్రావిటే కారు CMF-A ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో వినూత్నమైన ఎల్‌ఈడీ డీఆర్ఎల్, సిగ్నేచర్ క్రోమ్ గ్రిల్, బోనెట్ మీద గంభీరంగా కనిపించే GRAVITE అక్షరాలు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. నిస్సాన్ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ కారు సిగ్నేచర్ టీల్ షేడ్‌తో పాటు వైట్, సిల్వర్, బ్లాక్, గ్రే రంగుల్లో లభించనుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కారుకు ఆధునిక స్పర్శను ఇస్తుంది.
ఇంజిన్, ఫీచర్ల పరంగా ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది. కారు లోపల సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్) వంటి భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారు ధర సుమారు రూ.5.76 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లో ఉన్న రెనాల్ట్ ట్రైబర్, మారుతి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

