Nissan Magnite : రూ.1.20లక్షల భారీ డిస్కౌంట్..టాటా పంచ్‌కు చుక్కలు చూపిస్తున్న నిస్సాన్ మాగ్నైట్
టాటా పంచ్‌కు చుక్కలు చూపిస్తున్న నిస్సాన్ మాగ్నైట్

Nissan Magnite : జపనీస్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్, కొత్త ఏడాది సందర్భంగా భారతీయ వినియోగదారులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తన పాపులర్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్ మీద కళ్లు చెదిరే డిస్కౌంట్‌ను ప్రకటించింది. జనవరి 1 నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు కంపెనీ ముందే చెప్పినప్పటికీ, ఇప్పుడు ఏకంగా రూ.1.20లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తూ కస్టమర్లను ఆశ్చర్యపరిచింది.
నిస్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చౌకైన, సురక్షితమైన ఎస్‌యూవీలలో ఒకటి. దీని ప్రారంభ ధర ప్రస్తుతం రూ.5.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఒకవేళ 3 శాతం ధరల పెంపు అమలులోకి వస్తే, బేస్ వేరియంట్ ధర రూ.5.78 లక్షలకు చేరుతుంది. అయితే జనవరి 22లోపు కారు కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్ ఇస్తోంది. దీనివల్ల పెరిగిన ధరల భారం కస్టమర్ల మీద పడకుండా, పైగా భారీగా డబ్బు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది.
మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, రెనో కైగర్ వంటి కార్లతో పోటీ పడుతోంది. టాటా పంచ్ లాగే మాగ్నైట్ కూడా గ్లోబల్ NCAP క్రెష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అంటే తక్కువ బడ్జెట్‌లో మీ కుటుంబానికి పూర్తి రక్షణ ఇచ్చే కారు ఇది. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
మాగ్నైట్ కేవలం సేఫ్టీలోనే కాదు, మైలేజ్ లో కూడా అదరగొడుతోంది. ఇందులో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడే వారి కోసం నిస్సాన్ ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌ను కూడా అందిస్తోంది. ఇది కేజీకి ఏకంగా 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉండటంతో సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

