Nissan Magnite : తగ్గేదేలే అంటున్న నిస్సాన్ మాగ్నైట్.. కొత్త 7-సీటర్ కారు వచ్చినా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు
కొత్త 7-సీటర్ కారు వచ్చినా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు

Nissan Magnite : నిస్సాన్ ఇండియా కంపెనీ మే 2026 సేల్స్ రిపోర్ట్ అధికారికంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం నిస్సాన్ సంస్థ భారతీయ మార్కెట్లో రెండు ప్రధాన మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ఒకటి సూపర్ హిట్ ఎస్‌యూవీ మాగ్నైట్ కాగా.. మరొకటి సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ గ్రావైట్. కంపెనీ ఈ కొత్త 7-సీటర్ కారుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, మే నెలలో అది ఆశించిన స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. అమ్మకాల పరంగా కొత్త గ్రావైట్ వెనుకబడిపోగా.. పాత నమ్మకమైన మాగ్నైట్ కారు మరోసారి నిస్సాన్ కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన నంబర్-1 కారుగా తన కిరీటాన్ని నిలబెట్టుకుంది.
మే నెల అమ్మకాల పూర్తి వివరాలు
మే 2026 లో నిస్సాన్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా మొత్తం 2,948 వాహనాలను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాలలో సింహభాగం మళ్లీ మాగ్నైట్ కారుదే కావడం విశేషం. నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ గత నెలలో 1,665 యూనిట్ల విక్రయాలను సాధించగా.. సరికొత్త 7-సీటర్ గ్రావైట్ కేవలం 1,283 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది. దీనిని బట్టి మార్కెట్లోకి ఎన్ని కొత్త మల్టీ పర్పస్ వాహనాలు వచ్చినప్పటికీ.. బడ్జెట్ ధరలో లభించే కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపే భారతీయ కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
అందుబాటు ధర, అదిరిపోయే ఇంజిన్ ఆప్షన్లు
నిస్సాన్ మాగ్నైట్ ఇంతగా సక్సెస్ కావడానికి దాని అత్యంత తక్కువ ధర, నమ్మకమైన పర్ఫార్మెన్సే ప్రధాన కారణం. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.65 lakhs గా ఉంది. సాంకేతికంగా ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, పవర్‌ఫుల్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని బేస్ ఇంజిన్ 71bhp పవర్, 96Nm టార్క్‌ను అందిస్తుంది. కస్టమర్ల సౌకర్యార్థం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ, సీవీటీ, 6-స్పీడ్ మాన్యువల్ వంటి నాలుగు రకాల విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లను నిస్సాన్ సంస్థ అందిస్తోంది.
లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే నిస్సాన్ మాగ్నైట్ పెద్ద ఖరీదైన కార్లకు ఏమాత్రం తీసిపోదు. ఇందులో వైర్‌లెస్ చార్జర్, వాహనం చుట్టూ ఉన్న పరిసరాలను చూపించే 360 డిగ్రీ కెమెరా, అరౌండ్ వ్యూ మానిటర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్, వాతావరణం చల్లబడగానే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే వాతావరణ ఆధారిత లాక్, స్మార్ట్ ఐ-కీ (i-Key), క్యాబిన్ లోపల స్వచ్ఛమైన గాలిని ఇచ్చే అడ్వాన్స్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రీమియం లేదర్ టచ్ ఇంటీరియర్, ఎండ వేడిని తట్టుకునే హీట్ ఇన్సులేషన్ సీట్లు, అందమైన యాంబియంట్ లైటింగ్, ప్రయాణాల్లో లగేజీ కోసం 540 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.
క్రాష్ టెస్ట్‌లో లభించిన 5-స్టార్ సేఫ్టీ
భద్రత పరంగా నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ కారులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అనేక ఆధునిక సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా చేర్చారు. దీనివల్ల ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించినప్పుడు.. పెద్దల రక్షణలో ఈ కారుకు అత్యున్నత 5-స్టార్ రేటింగ్ లభించింది. ఈ ఘనత సాధించిన, దక్షిణాఫ్రికా మార్కెట్లో విక్రయించబడిన మొదటి మేడ్ ఇన్ ఇండియా కారుగా ఇది నిలిచింది. కాగా పిల్లల రక్షణలో దీనికి 3-స్టార్ రేటింగ్ దక్కింది.
మార్కెట్ పోటీదారులకు గట్టి సవాల్
భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ.. ఈ సెగ్మెంట్లో ఎంతో పాపులర్ అయిన కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి దిగ్గజ కార్లతో నేరుగా పోటీ పడుతోంది. ఇంతటి భారీ పోటీ ఉన్నప్పటికీ.. కేవలం రూ.5.65 లక్షల బడ్జెట్ ధరలోనే గ్లోబల్ 5-స్టార్ రేటింగ్ భద్రత, అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్లు లభిస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారుల మొదటి ప్రాధాన్యతగా నిస్సాన్ మాగ్నైట్ తన జలవాను నిలబెట్టుకుంది.

