Nissan Tekton: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ ఇండియాకు జులై నెల ఎంతగానో కలిసి వచ్చింది. కంపెనీ భారత మార్కెట్లోకి జులై 9న అధికారికంగా విడుదల చేసిన కొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీ టెక్టాన్ లాంచ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జులై నెలలో కంపెనీ మొత్తం 1,670 యూనిట్ల టెక్టాన్ ఎస్‌యూవీలను డీలర్లకు పంపింది. నిస్సాన్ నమోదు చేసిన మొత్తం 4,518 ప్రయాణీకుల వాహనాల విక్రయాలలో ఒక్క టెక్టాన్ వాటానే దాదాపు 37 శాతంగా ఉండడం విశేషం. ఈ మోడల్ రాకతో గత ఏడాది జులైతో పోలిస్తే నిస్సాన్ విక్రయాలు ఏకంగా 218 శాతం భారీ వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

మూడు మోడళ్లతో నిస్సాన్ పోర్ట్‌ఫోలియో బలోపేతం

గతంలో నిస్సాన్ సేల్స్ ప్రధానంగా మ్యాగ్నెట్ మోడల్‌పైనే ఆధారపడి ఉండేవి. అయితే ఫిబ్రవరిలో గ్రావిట్, జులైలో టెక్టాన్ మోడళ్ల చేరికతో కంపెనీ సేల్స్ ఊపందుకున్నాయి. జులై నెలలో మ్యాగ్నెట్ 1,462 యూనిట్ల విక్రయాలతో (32% వాటా) రెండో స్థానంలో నిలవగా, గ్రావిట్ 1,386 యూనిట్లతో (31% వాటా) మూడో స్థానంలో నిలిచింది. దీంతో మొదటిసారిగా నిస్సాన్ ఇండియా వద్ద అమ్మకాలను ముందుకు నడిపించే మూడు బలమైన మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

ధరలు, ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు

భారత మార్కెట్లో నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.18.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. కంపెనీ దీనిని మొత్తం 12 వేరియంట్లలో లభ్యమయ్యేలా తీర్చిదిద్దింది. ఈ ఎస్‌యూవీలో రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 100hp పవర్‌ను ఇచ్చే 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ కాగా, రెండోది 163hp పవర్‌ను అందించే పవర్‌ఫుల్ 1.3-లీటర్ 4-సిలిండర్ టర్బో ఇంజిన్. 1.0-లీటర్ ఇంజిన్ కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రాగా, 1.3-లీటర్ ఇంజిన్ 6-స్పీడ్ వెట్-క్లచ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

ప్రీమియం ఫీచర్లు, భద్రత

ఇంటీరియర్, ఫీచర్ల విషయానికి వస్తే, టెక్టాన్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమెట్ కంట్రోల్, 48-కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ఇవే కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, 6-స్పీకర్ ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక వసతులు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా రూపొందించిన ఈ కారు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇది మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్తోస్, రెనో డస్టర్, టాటా సియెర్రా వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story