ఫిబ్రవరి 4న నిస్సాన్ టెక్టాన్ వచ్చేస్తోంది

Nissan Tekton : జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ భారతీయ మార్కెట్లోకి తన గ్రాండ్ రీ-ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 4, 2026న ఈ కారును ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెడితే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ తప్పదని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని ఫిబ్రవరి 4న ఆవిష్కరిస్తున్నప్పటికీ, దీని విక్రయాలు జూన్ 2026 నుంచి ప్రారంభం కావచ్చని సమాచారం. ఇది రెనాల్ట్ మూడవ తరం డస్టర్‌ (జనవరి 26న లాంచ్) ఆధారంగా రూపొందించబడింది. నిస్సాన్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా ఈ కారును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఈ ఎస్‌యూవీ డిజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నిస్సాన్ పెట్రోల్ నుంచి ప్రేరణ పొందింది. ముందు భాగంలో విశాలమైన గ్రిల్, దానిని ఆనుకుని ఉండే సి ఆకారపు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్‌పై అమర్చిన వెనుక డోర్ హ్యాండిల్స్ ఈ కారుకు ఒక యూనిక్ స్టైల్‌ను అందిస్తాయి.

కారు లోపలి భాగం మూడు రంగుల కలయికతో కూడిన డ్యాష్‌బోర్డ్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టెక్టాన్ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలోనే రానుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉండే అవకాశం ఉంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఈ కారులో హైబ్రిడ్ వెర్షన్, ఆల్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్లు కూడా వస్తాయని ఆటో వర్గాల సమాచారం.

నిస్సాన్ టెక్టాన్ సుమారు రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉండొచ్చు. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీనిస్తుంది. నిస్సాన్ బ్రాండ్ మీద నమ్మకం ఉన్నవారికి, కొత్తదనం కోరుకునే వారికి టెక్టాన్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story