Nissan : మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో భూకంపం.. జూలై 9న నిస్సాన్ టెక్టాన్ వస్తోంది
జూలై 9న నిస్సాన్ టెక్టాన్ వస్తోంది

Nissan : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రసవత్తర పోరుకు తెరలేవబోతోంది. ఇన్నాళ్లూ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ జట్ల గుత్తాధిపత్యానికి గట్టి బ్రేకులు వేసేందుకు జపనీస్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. తన సరికొత్త గ్లోబల్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్‌ను 2026 జూలై 9న అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తుది విడత రోడ్ టెస్టింగ్‌లో ఉన్న ఈ కారు ఫీచర్లు, లుక్స్ లీక్ అవ్వడంతో ఆటోమొబైల్ లవర్స్‌లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇంటర్నేషనల్ రేంజ్ లుక్..
నిస్సాన్ కంపెనీ వర్గాల్లో ఈ కొత్త కారును అంతర్గతంగా బేబీ పెట్రోల్ అని పిలుచుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ల్యాండ్ క్రూయిజర్, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లకు పోటీ ఇచ్చే నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ నిస్సాన్ పెట్రోల్ డిజైన్ ఆధారంగానే ఈ టెక్టాన్‌ను రూపొందించారు. ఎత్తుగా ఉండే బోనెట్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, బాక్సీ స్టైల్ బాడీ, భారీ ఫ్రంట్ గ్రిల్‌తో రోడ్డుపై వెళ్తుంటే ఈ కారు ఒక లగ్జరీ డైనోసార్ లాంటి అల్టిమేట్ రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తుంది. దీనికి తోడు స్లీక్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కనెక్టెడ్ టెయిల్ లైట్స్ కారుకు మరింత మోడరన్ లుక్‌ను తెచ్చిపెట్టాయి.
కొత్త డస్టర్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారీ..
సాంకేతిక పరంగా నిస్సాన్ టెక్టాన్ కారును సరికొత్త CMF-B మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇండియాలోకి రాబోతున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్లో కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం విశేషం. ఈ అడ్వాన్స్‌డ్ ప్లాట్‌ఫామ్ వల్ల కారు బాడీ చాలా దృఢంగా ఉండటమే కాకుండా, హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు అద్భుతమైన స్టెబిలిటీని ఇస్తుంది. భవిష్యత్తులో రాబోయే హైబ్రిడ్ ఇంజన్లకు, క్రాష్ టెస్ట్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని డిజైన్ చేశారు.
పెద్ద డిజిటల్ స్క్రీన్, సన్‌రూఫ్..
కారు లోపల అడుగుపెడితే కస్టమర్లకు లగ్జరీ థియేటర్ ఫీలింగ్ వచ్చేలా నిస్సాన్ ఏర్పాట్లు చేసింది. డ్యాష్‌బోర్డ్‌పై 10.25-ఇంచుల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. దీనితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ప్రీమియం ఆర్కామిస్ 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, స్కై వ్యూని ఆస్వాదించడానికి పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, కాలేజీ కుర్రాళ్లను ఆకట్టుకునేలా 48-కలర్ యాంబియంట్ లైటింగ్, వెంట్లేటెడ్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్ల జాతరను ఇందులో నింపేశారు.
మూడు రకాల పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు
భద్రత విషయంలో నిస్సాన్ ఈ కారులో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో లెవెల్-2 ADAS టెక్నాలజీ, చుట్టూ ఉన్న పరిసరాలను క్లియర్ గా చూపించే 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు.
ఇక ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే ఇది మూడు రకాల వేరియంట్లలో రానుంది
1.0 లీటర్ టర్బో పెట్రోల్: ఇది 100 bhp పవర్, 166 Nm టార్క్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్.
1.3 లీటర్ టర్బో పెట్రోల్: ఇది ఏకంగా 162 bhp పవర్, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో మ్యాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.
స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్: పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ మోడల్ లీటరుకు 22 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని సమాచారం.

