Nissan Tekton : క్రెటా, సెల్టోస్‌లకు చుక్కలే.. నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ వస్తోంది బాసూ
నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ వస్తోంది బాసూ

Nissan Tekton : జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్, భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. అదే నిస్సాన్ టెక్టన్మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇప్పటికే పుణె సమీపంలోని పింప్రి వద్ద ఈ కారు టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కళ్లకు చిక్కింది. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ నిర్మించిన ప్లాట్‌ఫారమ్ మీదే ఈ టెక్టన్‌ను కూడా రూపొందించారు. ఈ కారు ప్రస్తుతం అరాయ్ హోమోలోగేషన్ పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది, అంటే త్వరలోనే ఇది మన రోడ్లపైకి రావడం ఖాయం.
డిజైన్ విషయానికి వస్తే.. నిస్సాన్ టెక్టన్ చూడటానికి చాలా గంభీరంగా, రోడ్డుపై మంచి ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. దీని పొడవు సుమారు 4,345 mm ఉండగా, వీల్‌బేస్ 2,657 mm వరకు ఉంటుంది. అంటే ఇది కొత్త డస్టర్ అంత వెడల్పుగా, పొడవుగా ఉండబోతోంది. స్పై షాట్స్‌లో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. ఇందులో చౌకైన స్టీల్ వీల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది బేస్ వేరియంట్ అయి ఉండవచ్చు. అయితే టాప్ మోడల్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ సి-షేప్ టెయిల్ లైట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. కారు ముందు భాగంలో TEKTON అనే 3D బ్యాజింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కారు లోపల కూడా నిస్సాన్ లగ్జరీకి పెద్దపీట వేస్తోంది. ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం), ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ ఏసీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండనున్నాయి. సేఫ్టీ కోసం బెస్ట్ లెవల్ అడాస్ సూట్ ప్యాకేజీని కూడా ఇందులో చేర్చనున్నారు. ఇంటీరియర్ థీమ్, అప్హోల్స్టరీ రెనో డస్టర్ కంటే భిన్నంగా, నిస్సాన్ తనదైన శైలిలో మరింత స్టైలిష్‌గా డిజైన్ చేసింది.
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే, టెక్టన్ మూడు రకాల ఆప్షన్లతో రాబోతోంది. బేస్ వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 100 పీఎస్ పవర్‌ను ఇస్తుంది. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది ఏకంగా 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తన విభాగంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంజిన్ కావడం విశేషం. అంతేకాకుండా, మైలేజ్ లవర్స్ కోసం 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.4 kWh బ్యాటరీతో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం

