Nissan Terrano 2026 : నిస్సాన్ టెర్రానో రీ ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో ల్యాండ్ క్రూయిజర్కే సవాల్
హైబ్రిడ్ టెక్నాలజీతో ల్యాండ్ క్రూయిజర్కే సవాల్

Nissan Terrano 2026 : ఒకప్పుడు మధ్యతరగతి ప్రజలకు చేరువైన బడ్జెట్ ఎస్‌యూవీగా పేరుగాంచిన నిస్సాన్ టెర్రానో, ఇప్పుడు గెటప్ మార్చి సరికొత్త అవతార్‌లో మన ముందుకు రాబోతోంది. చైనాలో జరిగిన ఆటో షో 2026లో నిస్సాన్ తన టెర్రానోను కేవలం ఒక కారులా కాకుండా ఒక అద్భుతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ రూపంలో పరిచయం చేసింది. పాత టెర్రానోకు, ఈ కొత్త మోడల్‌కు అస్సలు పోలికే లేనంతగా దీనిని డిజైన్ చేశారు. ఇది చూడటానికి టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి లగ్జరీ ఆఫ్ రోడర్లను తలపిస్తోంది.
కొత్త నిస్సాన్ టెర్రానోలో అత్యంత అధునాతనమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీని వాడారు. ఇందులో ఒక పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ రెండూ కలిసి ఏకంగా 400 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల కారుకు అద్భుతమైన వేగంతో పాటు కొండలు, కోనల్లో ప్రయాణించే పవర్ కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చిన్న చిన్న ప్రయాణాలకు పెట్రోల్ అవసరం లేకుండా కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లోనే దీనిని నడపవచ్చు. సుదీర్ఘ ప్రయాణాలకు మాత్రం పెట్రోల్ ఇంజిన్ సాయం తీసుకోవచ్చు. దీనివల్ల సిటీలో మైలేజీ పెరుగుతుంది, హైవేలో టెన్షన్ ఉండదు.
ఈ కొత్త మోడల్‌ను నిస్సాన్ కేవలం రోడ్ల మీద తిరగడానికే కాకుండా, కఠినమైన ఆఫ్-రోడింగ్ కోసం సిద్ధం చేసింది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉండటం వల్ల మట్టి రోడ్లు, బురదలో కూడా కారు అస్సలు తగ్గదు. డిజైన్ పరంగా చూస్తే ఇది చాలా రగ్డ్‌గా, బాక్సీ షేప్‌లో కనిపిస్తుంది. ఎత్తైన గ్రౌండ్ క్లీయరెన్స్, వెడల్పుగా ఉండే టైర్లు, భారీ స్కిడ్ ప్లేట్లు, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ లైటింగ్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. పాత టెర్రానోతో పోలిస్తే ఇది చాలా పెద్దదిగా, గంభీరంగా ఉండటంతో టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కారు లోపల అడుగుపెడితే మనం ఏదో భవిష్యత్తులో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. భారీ డిజిటల్ డిస్‌ప్లేలు, టచ్ స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ ఫీచర్లతో కేబిన్‌ను చాలా విలాసవంతంగా తీర్చిదిద్దారు. ప్రీమియం సీట్లు, విశాలమైన స్పేస్ ఉండటంతో లాంగ్ జర్నీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రదర్శించినది కేవలం కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే కాబట్టి, అసలు ప్రొడక్షన్ మోడల్ వచ్చేసరికి ఇంటీరియర్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో నిస్సాన్ టెర్రానోకు ఒకప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ ఇండియాకు వస్తుందా లేదా అనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇండియాకు తీసుకురావాలంటే ఇక్కడ లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేయడం, ధరను అందుబాటులో ఉంచడం నిస్సాన్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఏది ఏమైనా, ఎలక్ట్రిక్, పవర్ కలయికతో వస్తున్న ఈ కొత్త టెర్రానో.. రాబోయే రోజుల్లో ఎస్‌యూవీల ట్రెండ్‌ను మార్చేలా కనిపిస్తోంది.

