Nissan : నిస్సాన్ టెరానో రీ ఎంట్రీ.. డిఫెండర్ రేంజ్ లుక్స్‌తో అదరగొడుతున్న కొత్త ఎస్యూవీ
డిఫెండర్ రేంజ్ లుక్స్‌తో అదరగొడుతున్న కొత్త ఎస్యూవీ

Nissan : ఒకప్పుడు భారతీయ రోడ్లపై రాజసం ఒలికించిన నిస్సాన్ టెరానో మళ్లీ వస్తోంది. అయితే ఈసారి సరికొత్త అవతారంలో, అదిరిపోయే లుక్స్‌తో తన పాత వైభవాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. 2026 బీజింగ్ ఆటో షోలో నిస్సాన్ సంస్థ ఈ కొత్త టెరానో కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని డిజైన్ ఉండటం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.
డిఫెండర్‌ను తలపించే డిజైన్
బీజింగ్ ఆటో షోలో ప్రదర్శించిన ఈ కొత్త టెరానో కాన్సెప్ట్ పూర్తిగా బాక్సీ డిజైన్ తో ఉంది. దీని భారీ బాడీ క్లాడింగ్, వెడల్పైన టైర్లు, మజిక్యులర్ స్టైలింగ్ చూస్తుంటే ఇది కచ్చితంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి స్పూర్తి పొందినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా వెనుక వైపు ఉన్న ఫ్లాట్ టెయిల్‌గేట్, మధ్యలో అమర్చిన స్పేర్ వీల్, మోడ్రన్ LED టెయిల్ లైట్లు దీనికి ఒక అడ్వెంచర్ లుక్ ఇస్తున్నాయి. ఈ కారుపైకి ఎక్కడానికి సైడ్ లాడర్ కూడా ఉండటం విశేషం.
హైటెక్ హైబ్రిడ్ పవర్
ఈ కొత్త తరం టెరానో కేవలం లుక్స్‌లోనే కాదు, టెక్నాలజీలో కూడా టాప్ అనిపించుకోనుంది. దీనిలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఇంజన్ సిస్టమ్‌ను నిస్సాన్ ప్రవేశపెట్టింది. దీనివల్ల కారుకు అద్భుతమైన పవర్ అందడమే కాకుండా, మైలేజ్ కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఒక స్ట్రాంగ్ లాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై దీనిని తయారు చేస్తున్నారు, దీనివల్ల కఠినమైన ఆఫ్-రోడ్ ప్రయాణాల్లో కూడా ఈ కారు మొరాయించదు. వచ్చే ఏడాది కల్లా ఇది ప్రొడక్షన్ దశకు చేరుకుని మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
భారత్ లో నిస్సాన్ వ్యూహం
టెరానో కాన్సెప్ట్ ఒకవైపు ఉండగా, భారతీయ మార్కెట్ కోసం నిస్సాన్ టెక్టాన్ అనే సరికొత్త ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఇండియాలో పాత టెరానో స్థానాన్ని ఈ టెక్టాన్ భర్తీ చేయనుంది. ఈ ఏడాది జూన్ నాటికే దీని లాంచ్ ఉండవచ్చని సమాచారం. హై గ్రౌండ్ క్లియరెన్స్, బోల్డ్ బాడీ స్టైలింగ్, నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్ తో ఈ కారు రానుంది. దీని టీజర్ ఇప్పటికే నెట్టింట సందడి చేస్తోంది.
ఫీచర్లు మరియు సేఫ్టీ అదరహో
నిస్సాన్ టెక్టాన్ లేదా కొత్త టెరానో కేబిన్ లోపల లగ్జరీకి పెద్దపీట వేశారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండనున్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగులు ప్రామాణికంగా ఇచ్చే అవకాశం ఉంది. ఇంజన్ పరంగా 1.0-లీటర్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

