Nissan Tekton : రోడ్డు మీద ఈ కారును చూస్తే క్రెటా, సెల్టోస్‌లు సైడ్ ఇచ్చేయాల్సిందే
క్రెటా, సెల్టోస్‌లు సైడ్ ఇచ్చేయాల్సిందే

Nissan Tekton : జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పటిష్టం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని టెక్టాన్ అనే మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. లీకైన చిత్రాల ప్రకారం.. ఈ కారు చాలా బాక్సీగా, మజిల్ లుక్‌తో కనిపిస్తోంది. ఎదుటి నుంచి చూస్తే ఫ్లాట్ బోనెట్, ఎండ్-టు-ఎండ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్ ఈ కారుకు రోడ్డు మీద ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. అలాగే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, 225-సెక్షన్ టైర్లు ఈ ఎస్‌యూవీకి ఒక మంచి స్టాన్స్‌ను అందిస్తున్నాయి.
డిజైన్ పరంగా నిస్సాన్ ఒక విభిన్నమైన రూట్‌ను ఎంచుకుంది. స్లీక్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, సిల్వర్ ఫినిషింగ్ ఉన్న బంపర్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వెనుక డోర్ హ్యాండిల్స్ సి-పిల్లర్ పై ఉన్నాయి, ఇది కారుకు మోడ్రన్ టచ్ ఇస్తుంది. అలాగే పెద్ద రూఫ్ రైల్స్ కారు ఎత్తును మరింత పెంచి చూపుతున్నాయి. నిస్సాన్ కిక్స్ తర్వాత సి-సెగ్మెంట్‌లో నిస్సాన్ ఇస్తున్న అసలైన పోటీ ఇదే కాబోతోంది.
లోపలి భాగంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిస్సాన్ అన్ని రకాల లగ్జరీ ఫీచర్లను సిద్ధం చేస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన పెద్ద టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఇందులో ఉండనున్నాయి. అంతేకాకుండా, భద్రత కోసం అడాస్ టెక్నాలజీని కూడా నిస్సాన్ ఈ కారులో జోడించే అవకాశం ఉంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే రాబోతున్నప్పటికీ, భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ కారు 2026 మొదటి భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో దీనికి పోటీ మామూలుగా లేదు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాత్రమే కాకుండా మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రా, టాటా కర్వ్, హోండా ఎలివేట్ వంటి దాదాపు 15 మోడళ్లతో ఇది తలపడాల్సి ఉంటుంది. రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య దీని ధర ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ ఈ టెక్టాన్ ఎస్‌యూవీతో పాటు ఒక 7-సీటర్ ఎంపీవీని కూడా లాంచ్ చేసే ప్లాన్‌లో ఉంది.

