E20 Petrol : దేశవ్యాప్తంగా వాహనాల్లో వాడుతున్న E20 ఇంధనం వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బుధవారం రాజ్యసభలో ఎంపీ ఎ.ఎ. రహీమ్ అడిగిన ప్రశ్నకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల్లో ఎలాంటి పెద్ద లోపాలు లేదా ఇంజిన్ వైఫల్యాలు జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు లేదా నివేదికలు రాలేదని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవాలని కొట్టిపారేశారు.

విస్తృత పరిశోధనల తర్వాతే అమల్లోకి

టూవీలర్స్, ఫోర్ వీలర్స్ పై E20 ఇంధన ప్రభావంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), SIAM సంస్థలు క్షుణ్ణంగా పరిశోధనలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల సమయంలో ప్రస్తుత BS-VI ప్రమాణాలు కలిగిన వాహనాల్లో కానీ, పాత వాహనాల పనితీరులో కానీ ఎలాంటి పెద్ద వ్యత్యాసం కనిపించలేదని స్పష్టం చేసింది. ఇంధన నాణ్యత, వాహనాల భద్రతపై ప్రభుత్వం పూర్తి నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

BS-III వాహనదారులకు చిన్న హెచ్చరిక

అయితే, 2005 ఏప్రిల్ 1 నుంచి 2016 మధ్యకాలంలో తయారైన కొన్ని నిర్దిష్టమైన BS-III ప్రమాణాలు కలిగిన పాత వాహనాల్లో E20 వాడకం వల్ల చిన్నపాటి మార్పులు అవసరం కావచ్చునని మంత్రి తెలిపారు. ఈ వాహనాల్లోని రబ్బరు భాగాలు ఇథనాల్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున, వాటిని మార్చాల్సి రావచ్చు. అయితే వీటిని వాహనం సాధారణ సర్వీసింగ్ సమయంలోనే మెకానిక్స్ సులభంగా భర్తీ చేయవచ్చని, దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

మైలేజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే

వాహనాల మైలేజ్ తగ్గుతోందనే ఆరోపణలపై కూడా మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఒక వాహనం ఇచ్చే మైలేజ్ అనేది కేవలం వాడే పెట్రోల్ రకంపైనే ఆధారపడి ఉండదని వివరించింది. వాహనదారుడి డ్రైవింగ్ అలవాట్లు, సరైన సమయంలో ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్ పరిశుభ్రత, టైర్లలో సరైన గాలి ఒత్తిడి, ఏసీ వినియోగం వంటి అనేక అంశాలు మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయని మంత్రి వెల్లడించారు. క్రమం తప్పకుండా వాహన సర్వీసింగ్ చేయిస్తే మైలేజ్ సమస్యలు ఉండవని సూచించారు.

ఇథనాల్ బ్లెండింగ్‌లో భారత్ సంచలన పురోగతి

భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. నీతి ఆయోగ్ అంతర్-మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సులు మరియు జూన్ 2021లో విడుదల చేసిన రోడ్‌మ్యాప్ 2020-25 నివేదిక ఆధారంగా దశలవారీగా ఇథనాల్ శాతాన్ని పెంచుతున్నారు. 2013-14లో మనదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కేవలం 1.53 శాతంగా ఉండగా, 2024-25 నాటికి అది ఏకంగా 19.2 శాతానికి చేరుకుంది. డిసెంబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story