Traffic Rules: రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు తరచూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై కేవలం చలానా కట్టి సరిపెట్టుకోవడం కుదరదు. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అత్యంత కఠినమైన కొత్త పాయింట్ల విధానాన్ని ప్రకటించారు. పదే పదే తప్పులు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) సైతం రద్దయ్యే ప్రమాదముంది. భారత సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) 66వ వార్షిక సదస్సులో పాల్గొన్న నితిన్ గడ్కరీ రహదారి ప్రమాదాల అరికట్టేందుకు ఈ విధానాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఆర్సీకి ఒక నిర్దిష్ట పాయింట్ల వ్యవస్థను అనుసంధానిస్తారు. డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ప్రతిసారీ ఖాతా నుంచి పాయింట్లు కట్ అవుతాయి. ఈ కోత విధించిన పాయింట్లు ఒక పరిమితి దాటితే అధికారులు ఆ వ్యక్తి లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసే అధికారాన్ని పొందుతారు. అలవాటుగా నిబంధనలు ఉల్లంఘించే వారికి చెక్ పెట్టడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.

క్రమశిక్షణ కలిగిన డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనాలు

ఈ కొత్త విధానం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా క్రమశిక్షణతో వాహనాలు నడిపే వారికి రివార్డులు అందించనుంది. ఉత్తమ రికార్డు ఉన్న వాహనదారులకు ఇన్‌స్యూరెన్స్ ప్రీమియంలో ప్రత్యేక తగ్గింపులు, ఇతర ఆర్థిక రాయితీలు దక్కుతాయి. నిర్లక్ష్యంగా నడిపేవారికి, రూల్స్ పాటించే వారికి మధ్య వ్యత్యాసం చూపించడమే కాకుండా, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి ఇన్సూరెన్స్ కంపెనీల సహాయంతో ఈ ప్లాన్ అమలు చేయబోతున్నారు.

పాత బీఎస్-4 వాహనదారులకు శుభవార్త

ఈ సదస్సు వేదికగా పాత బీఎస్-4 వాహనదారులకు నితిన్ గడ్కరీ పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. పాత వాహనాల కోసం రూ.4000 నుంచి రూ.5000 ఖరీదు చేసే ప్రత్యేక ఉద్గార నియంత్రణ పరికరాన్ని సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ పరికరం ట్రయల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. దీనిని పాత వాహనాల్లో అమర్చడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ సరికొత్త బీఎస్-6 ప్రమాణాలకు సమానంగా మారుతుంది. తక్కువ ఖర్చుతోనే పాత బండ్ల కాలుష్యాన్ని అరికట్టవచ్చని స్పష్టం చేశారు.

భారత్ ఎన్‌సిఎపి 2.0, కొత్త ట్రైనింగ్ సెంటర్లు

దేశంలో ఏటా జరుగుతున్న 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అత్యధికులు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టడానికి అక్టోబర్ 2027 నుంచి భారత్ ఎన్‌సిఎపి 2.0 అమల్లోకి తీసుకొస్తున్నారు. వాహనాల భద్రతా ప్రమాణాలను ఇది కఠినంగా మూల్యాంకనం చేస్తుంది. దేశవ్యాప్తంగా సరైన శిక్షణ అందించేందుకు 1600 కొత్త డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే 24 సెంటర్లు సేవలు ప్రారంభించాయి.

Next Story