New Launch : ఆటో రంగంలో సెన్సేషన్.. టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ.. లాంచ్ తేదీలు ఖరారు!
టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ.. లాంచ్ తేదీలు ఖరారు!
New Launch : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే కొద్ది నెలల్లో నోస్టాల్జియా వేవ్ నడవబోతోంది. ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన, అత్యంత ప్రజాదరణ పొందిన రెండు దిగ్గజ ఎస్‌యూవీలు టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్ సరికొత్త రూపం, అడ్వాన్సుడ్ ఫీచర్లతో తిరిగి వస్తున్నాయి. నవంబర్ నుండి జనవరి మధ్య ఈ రెండు ప్రత్యేకమైన కార్ల లాంచ్‌లతో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో భారీ సందడి నెలకొనబోతోంది. ఈ కార్ల రీఎంట్రీ తేదీలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకుందాం.
భారతీయ కార్ల మార్కెట్లో ఒకప్పుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రెండు మోడళ్లు టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్. ఇప్పుడు కొత్త శకంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. టాటా సియెరా 1991 నుండి 2003 వరకు మార్కెట్లో ఉండి తన సమయానికి ముందే రూపొందించబడిన డిజైన్‌తో ప్రీమియం ఎస్‌యూవీగా నిలిచింది. ఇక రెనాల్ట్ డస్టర్, ఈ దశాబ్దం ప్రారంభంలో నిలిచిపోయే ముందు ఫ్రాన్స్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా పేరు తెచ్చుకుంది. ఈ రెండు వాహనాలు అద్భుతమైన రీ-ఎంట్రీ కోసం సిద్ధంగా ఉన్నాయి. టాటా సియెరాను నవంబర్ 25న లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించగా, రెనాల్ట్ డస్టర్ కంప్లీట్ మోడ్రన్ లుక్కుతో వచ్చే ఏడాది జనవరి 26న భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
చాలా కాలంగా భారత మార్కెట్ ఈ కొత్త సియెరా రాక కోసం ఎదురుచూస్తోంది. దీని కాన్సెప్ట్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కొత్త సియెరా ICE, EV అనే రెండు వేరియంట్‌లలో లాంచ్ కానుంది. మొదటగా నవంబర్‌లో ICE-బేస్డ్ మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒరిజినల్ మోడల్‌లోని ఆల్పైన్ విండో, హై-సెట్ బోనెట్, మోడ్రన్ వీల్ ఆర్చ్‌లు వంటి అనేక స్టైలింగ్ అంశాలు కొత్త కాన్సెప్ట్‌లో కూడా కొనసాగించారు. కొత్త సియెరాలో మూడు 1.5-లీటర్ ఇంజిన్‌లు లభించే అవకాశం ఉంది: 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ పవర్‌మిల్.
రెనాల్ట్ డస్టర్ సరికొత్త జనరేషన్ మోడల్‌లో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇది పాత మోడల్‌తో పోలిస్తే పూర్తి డిజైన్ మార్పులను సంతరించుకుంది. కొత్త తరం డస్టర్ పాత మోడల్ కంటే పెద్దదిగా, వెడల్పుగా, ఎత్తుగా కనిపిస్తుంది. దీని డిజైన్ పూర్తిగా కొత్తగా, ఆకర్షణీయంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో కొత్త డస్టర్ 1.3-లీటర్, 1.6-లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. దీంతో పాటు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. భారతదేశంలో లాంచ్ కాబోయే మోడల్‌లో కూడా ఈ పవర్‌ట్రైన్ ఎంపికలన్నీ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.










