Maruti Suzuki: మారుతి సుజుకి ఇప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతోంది. రాబోయే పదేళ్ల కోసం సంస్థ ప్రత్యేక టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. భారతీయ రోడ్లు, ఇక్కడి ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో కూడిన ఫీచర్లను అందిస్తూనే భద్రత, డ్రైవింగ్ అనుభవాన్ని పెంచడమే లక్ష్యంగా సుజుకి అడుగులు వేస్తోంది.

మన రోడ్లకు సరిపోయే జస్ట్ రైట్ ADAS

భారత్‌లో నగరాల ట్రాఫిక్ మిగతా దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కార్లు, బైకులు, ఆటోలు, పదాచారులు ఒకే రహదారిపై ప్రయాణిస్తుంటారు. లెన్ మార్కింగ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొన్ని చోట్ల స్పష్టంగా ఉండవు. అందుకే జపాన్ వంటి విదేశాల టెక్నాలజీని నేరుగా భారత్‌లో వాడటం సాధ్యం కాదని సుజుకి భావిస్తోంది. దీనికోసం జస్ట్ రైట్ ADAS కాన్సెప్ట్‌ను తీసుకొస్తోంది. డ్రైవర్‌ను అనవసర హెచ్చరికలతో విసిగించకుండా, ప్రమాదాలు జరగకుండా కాపాడే లెవల్ 1, లెవల్ 2 ఫీచర్లపై మాత్రమే దృష్టి పెడుతోంది. ఇది కారు ధరను పెంచకుండా ప్రయాణికులకు భద్రతను ఇస్తుంది.

కార్లలో ప్రతి చిన్న భాగానికీ బరువు తగ్గింపు

సుజుకి తన వాహనాల బరువును సుమారు 100 కిలోల వరకు తగ్గించేందుకు రీసెర్చ్ చేస్తోంది. పెద్ద భాగాలే కాకుండా, కారులో వాడే బోల్టుల పరిమాణాన్ని కూడా పునఃపరిశీలస్తోంది. ఉదాహరణకు ఒక M8 బోల్ట్ హెడ్ పరిమాణం తగ్గించడం ద్వారా 1 గ్రాము బరువు తగ్గుతుంది. ఒక కారులో దాదాపు 2,000 బోల్టులు ఉంటాయని భావిస్తే, ఈ చిన్న మార్పు పెద్ద వ్యత్యాసాన్ని చూపుతుంది. హై-టెన్సైల్ స్టీల్, ప్రత్యేక అల్లాయ్ మెటీరియల్స్ వాడటం ద్వారా వాహనం డిజైన్‌ను మరింత తేలికగా మారుస్తున్నారు. కారు బరువు తగ్గడం వల్ల మైలేజ్ పెరగడంతో పాటు ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ బాగా పెరుగుతుంది.

ఆకట్టుకుంటున్న సుజుకి eSky ఈవీ సక్సెస్ మోడల్

సుజుకి రూపొందించిన eSky అనే చిన్న ఎలక్ట్రిక్ కారును ఉదాహరణగా తీసుకుంటే, మొదట్లో దీని డ్రైవింగ్ రేంజ్ 230 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. కానీ పెద్ద బ్యాటరీని వాడకుండా కారులోని చిన్న చిన్న అంశాలను ఆప్టిమైజ్ చేశారు. టైర్ రోలింగ్ రెసిస్టెన్స్ తగ్గించడం, సస్పెన్షన్ సర్దుబాటు చేయడం, ఎల్ఈడీ విద్యుత్ వాడకాన్ని తగ్గించడం, గేర్ నిష్పత్తులను సరిచేయడం ద్వారా దీని రేంజ్‌ను ఏకంగా మరో 80 కిలోమీటర్లు పెంచారు. ఈ విధానాన్ని భారత్‌లో రాబోయే ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఉపయోగించనున్నారు.

ఈవీలతో పాటు హైబ్రిడ్, సీఎన్‌జీ మోడళ్లు

భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఆధారపడకుండా విభిన్న ఇంధన ప్రత్యామ్నాయాలను అందించాలని సంస్థ నిశ్చయించుకుంది. పెట్రోల్ కార్లతో పాటు క్లీన్ సీఎన్‌జీ, నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్, బయో-సీఎన్‌జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి అనేక రకాల ఇంజన్లపై పని చేస్తోంది. భారత్‌‌లో సీఎన్‌జీ కార్లకు ఉన్న డిమాండ్‌ను కొనసాగిస్తూనే, పర్యావరణహిత హ్యాట్రిక్ నెట్‌వర్క్‌ను సృష్టించడానికి ఈ వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Next Story