Car Sales : మారుతినా ?.. మహీంద్రానా ?.. నవంబర్లో మార్కెట్ కింగ్ ఎవరు?
నవంబర్లో మార్కెట్ కింగ్ ఎవరు?

Car Sales : భారతీయ మార్కెట్‌లో కార్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాహన్ పోర్టల్ అందించిన సమాచారం ప్రకారం.. నవంబర్ 2025లో దేశవ్యాప్తంగా మొత్తం 3,88,624 కార్లు అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్ (5,65,326 యూనిట్లు), జనవరి (4,73,520 యూనిట్లు) తర్వాత అత్యధిక నెలవారీ విక్రయాలు నమోదైన మూడవ నెలగా నవంబర్ నిలిచింది. పండుగ సీజన్ తర్వాత కూడా ఈ స్థాయిలో కార్ల విక్రయాలు జరగడం ఆటోమొబైల్ పరిశ్రమకు సానుకూల సంకేతం.
నెంబర్ 1 స్థానంలో మారుతి సుజుకి ఆధిపత్యం
భారతదేశంలో అత్యధిక కార్ల విక్రయాల విషయంలో మారుతి సుజుకి ఎప్పటిలాగే తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. నవంబర్ 2025లో మారుతి ఏకంగా 1,55,317 యూనిట్లను విక్రయించి, మొత్తం మార్కెట్ వాటాలో 40 శాతం దక్కించుకుంది. గత సంవత్సరం నవంబర్ 2024తో పోలిస్తే, మారుతి విక్రయాలలో 19 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కార్ల విభాగంలో మారుతి స్థానం చెక్కుచెదరలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నెం.2 స్థానం కోసం మహీంద్రా-టాటా మధ్య హోరాహోరీ
నవంబర్ 2025లో అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీల జాబితాలో నెం.2 స్థానం కోసం మహీంద్రా, టాటా మోటార్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి మహీంద్రా.. టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. నవంబర్ 2025లో మహీంద్రా మొత్తం 54,005 SUV యూనిట్లను విక్రయించింది. ఇందులో 2,767 ఎలక్ట్రిక్ SUVలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 2024తో పోలిస్తే మహీంద్రా విక్రయాలలో ఏకంగా 20 శాతం పెరుగుదల కనిపించింది. టాటా మోటార్స్ నవంబర్‌లో 51,672 కార్లను విక్రయించింది. మహీంద్రా కంటే కేవలం 2,333 యూనిట్ల విక్రయాలలో మాత్రమే టాటా వెనుకబడింది. టాటా విక్రయించిన వాటిలో 6,083 ఎలక్ట్రిక్ కార్లు ఉండటం విశేషం.
పెరుగుతున్న SUV డిమాండ్‌తో మహీంద్రాకు లాభం
ప్యాసింజర్ వాహనాల విక్రయాల మార్కెట్ వాటాలో నవంబర్ 2025లో మహీంద్రాకు 14 శాతం వాటా లభించగా, టాటాకు 13 శాతం వాటా దక్కింది. మహీంద్రా స్కార్పియో, థార్ వంటి మోడళ్లకు ఉన్న భారీ డిమాండ్ కారణంగానే ఈ కంపెనీ టాటాను వెనక్కి నెట్టగలిగింది. మహీంద్రా గత ఏడాది నవంబర్ 2024 (42,234 యూనిట్లు) తో పోలిస్తే ఈ సంవత్సరం 22 శాతం వృద్ధిని సాధించింది. టాటా ఎలక్ట్రిక్ వాహనాలలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, మహీంద్రా SUV విభాగంలో తన బలమైన పట్టును కొనసాగిస్తూ, ఓవరాల్ ర్యాంకింగ్‌లో పైచేయి సాధించింది.

