Ola Electric : ఇండియన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్ తమ కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. కంపెనీ తమ అత్యంత చౌకైన మోడల్స్ అయిన ఓలా ఎస్1 జెడ్ (Ola S1 Z), ఓలా జిగ్ (Ola Gig) స్కూటర్ల డెలివరీలను 2025 చివరి వరకు వాయిదా వేసింది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. తమ ప్రొడక్ట్ లైనప్‌ను మరింత విస్తరించడానికి ముందు తమ రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పాటు తమ అమ్మకాల నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తక్కువ ధరలో మంచి ఆప్షన్

ఓలా జిగ్ ధర రూ.39,999 నుంచి రూ.49,999 మధ్య ఉంది. చిన్న ప్రయాణాల కోసం ఓలా జిగ్‌ను డిజైన్ చేశారు. ఇందులో 1.5 kWh కెపాసిటీ ఉన్న రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్ అయినప్పుడు 112 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. రిమూవబుల్ బ్యాటరీతో పాటు మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఓలా జిగ్+ (Gig+)

ఓలా జిగ్+ ఎక్స్-షోరూమ్ ధర రూ.49,999. ఈ స్కూటర్‌ను ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం రూపొందించారు. ఇందులో 1.5 kWh కెపాసిటీ ఉన్న రిమూవబుల్ సింగిల్ లేదా డబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంటుంది. సింగిల్ బ్యాటరీతో 81 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు బ్యాటరీలతో 157 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో 1.5 kW పీక్ అవుట్‌పుట్ ఉన్న మోటార్ హబ్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ. వరకు ఉంటుంది.

ఓలా ఎస్1 జెడ్ (S1 Z)

ఓలా ఎస్1 జెడ్ ప్రారంభ ధర రూ.59,999. ఇందులో 1.5 kWh కెపాసిటీ ఉన్న రిమూవబుల్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ బ్యాటరీతో 75 కి.మీ. రేంజ్ ఇస్తుంది.

రెండు బ్యాటరీలతో 146 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఇది గంటకు 0-40 కి.మీ. వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకోగలదు. ఇందులో ఎల్‌సీడీ (LCD) డిస్‌ప్లే, ఫిజికల్ కీ(physical key) ఉంటాయి.

ఓలా తన రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఈ చౌక స్కూటర్ల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు 2025 చివరి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఆలస్యం ఓలా అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

PolitEnt Desk

PolitEnt Desk

Next Story