Ola S1 X+ 5.2 kWh : ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ ప్రయాణం.. ఓలా S1 X+ 5.2 kWh లాంచ్
ఓలా S1 X+ 5.2 kWh లాంచ్

Ola S1 X+ 5.2 kWh : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ మరో భారీ అడుగు వేసింది. రేంజ్ విషయంలో కస్టమర్లకు ఉన్న బెంగను తీరుస్తూ, ఏకంగా ఒక చిన్న కారు రేంజ్ ఇచ్చే సరికొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అదే ఓలా S1 X+ 5.2 kWh. అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో రూపొందిన ఈ స్కూటర్ ఇప్పుడు టూ-వీలర్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ధర మాత్రమే కాకుండా, ఇందులో వాడిన స్వదేశీ సాంకేతికత ప్రత్యర్థి కంపెనీలైన టీవీఎస్, బజాజ్‌లకు సవాల్ విసురుతోంది.
ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త స్కూటర్‌లో తన సొంతంగా తయారు చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వాడింది. సాధారణంగా ఇలాంటి హై-టెక్ బ్యాటరీ సెల్స్ చాలా ఖరీదైన ప్రీమియం స్కూటర్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఓలా వీటిని సామాన్య కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం విశేషం. బ్యాటరీ సెల్ తయారీ నుంచి పూర్తి వాహనం అసెంబ్లీ వరకు అంతా భారత్‌లోనే స్వయంగా చేస్తుండటంతో, స్కూటర్ ధరను రూ. 1,29,999 (ప్రారంభ ధర) వద్ద ఉంచగలిగింది. అయితే, ఈ ఆఫర్ ధర కేవలం ఏప్రిల్ 15 వరకు మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో అమర్చిన 11 kW మిడ్-డ్రైవ్ మోటార్ స్కూటర్‌కు అద్భుతమైన పవర్ ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది 320 కిలోమీటర్ల (IDC) రేంజ్ ఇస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హాయిగా ప్రయాణించవచ్చు. వేగం విషయంలోనూ ఇది ఏమాత్రం తగ్గదు. దీని గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. భద్రత కోసం ఇందులో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లను అందించారు.
ఈ కొత్త మోడల్ లాంచ్‌తో ఓలా పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం అయింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న జెన్ 3 ఎస్1 సిరీస్‌లోని ఎస్1 ప్రో+, ఎస్1 ప్రో వంటి ప్రీమియం మోడళ్లతో పాటు, ఇప్పుడు ఎస్1 ఎక్స్ సిరీస్ మరింత మంది కస్టమర్లను ఆకర్షించనుంది. కేవలం స్కూటర్లే కాకుండా, ఓలా ఇటీవలే రోడ్‌స్టర్ సిరీస్ పేరుతో మోటార్ సైకిల్ విభాగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధర, రేంజ్ విషయంలో ఉన్న ఆందోళనలను తొలగించి, సామాన్యుడికి ఈవీని దగ్గర చేయడమే లక్ష్యంగా ఓలా దూసుకుపోతోంది.

