Bike Buying Guide : ప్రస్తుత రోజుల్లో కొత్త బైక్ కొనుగోలు చేయడం అనేది కేవలం మైలేజ్, ఇంజిన్ సిసి లేదా ధర ఆధారంగా మాత్రమే జరగడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ద్విచక్ర వాహనాల్లో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా మారుస్తాయి. అయితే షోరూమ్‌కు వెళ్లే ముందు ఈ ఫీచర్ల పేర్లు వినడమే కాకుండా, వాటి అసలు ఉపయోగాలు ఏమిటో తెలుసుకోవడం వల్ల సరైన బైక్‌ను ఎంచుకోవడానికి వీలవుతుంది.

ఏబీఎస్ ప్రాముఖ్యత

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ బ్రేకింగ్ సిస్టమ్‎గా ప్రాచుర్యం పొందిన ABS బైక్‌లలో అత్యంత కీలకమైన సేఫ్టీ ఫీచర్‌గా మారింది. మనం వేగంగా వెళ్తున్నప్పుడు సడన్‌గా హార్డ్ బ్రేక్ వేస్తే, చక్రాలు లాక్ అయి బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏబీఎస్ సిస్టమ్ చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా తడి రోడ్లపై లేదా వర్షకాలంలో బైక్ అదుపు తప్పకుండా రైడర్‌కు సంపూర్ణ నియంత్రణను అందిస్తుంది.

రఫ్ రోడ్లపై తిరుగులేని గ్రిప్

రోడ్డుపై సరైన గ్రిప్ లేని పరిస్థితుల్లో లేదా ఇసుక, బురద ఉన్న ప్రదేశాలలో బైక్ వెనుక చక్రం అదుపు తప్పకుండా ఉండటానికి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెనుక చక్రం అవసరానికి మించి వేగంగా తిరగకుండా కంట్రోల్ చేస్తుంది, దీనివల్ల బైక్ బ్యాలెన్స్ దెబ్బతినదు. సాధారణంగా ఈ ఫీచర్ ప్రీమియం, స్పోర్ట్స్ బైక్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది.

వాతావరణానికి తగినట్లు పవర్‌ను మార్చే రైడ్ మోడ్స్

ఆధునిక ద్విచక్ర వాహనాల్లో Eco, Rain, Sport వంటి వివిధ రకాల రైడ్ మోడ్స్ ఇస్తున్నారు. ఇవి బైక్ ఇంజిన్ పవర్ డెలివరీని, థ్రోటల్ రెస్పాన్స్‌ను రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మారుస్తాయి. ఉదాహరణకు వర్షం పడుతున్నప్పుడు Rain Mode ఎంచుకుంటే పవర్ డెలివరీ స్మూత్‌గా మారి ప్రమాదాలను నివారిస్తుంది. అలాగే వేగంగా ప్రయాణించాలనుకున్నప్పుడు Sport Mode అదనపు పవర్‌ను అందిస్తుంది.

హైవే రైడర్లకు హెల్ప్ చేసే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్

ఎక్కువ దూరం ప్రయాణించే పర్యాటకులకు, హైవే రైడర్లకు క్రూయిజ్ కంట్రోల్ చాలా ప్రయోజనకరమైన ఫీచర్. దీన్ని ఆన్ చేసిన తర్వాత, ఎక్సలరేటర్‌ను పదే పదే పట్టుకోవాల్సిన అవసరం లేకుండా బైక్ స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో చేతిపై ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ ఫీచర్‌ను ఖాళీగా ఉన్న సురక్షితమైన హైవేలలో మాత్రమే ఉపయోగించాలి.

స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం స్లిప్పర్ క్లచ్

ఎక్కువ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు సడన్‌గా గేర్లు తగ్గించినప్పుడు వెనుక చక్రం లాక్ కాకుండా స్లిప్పర్ క్లచ్ కాపాడుతుంది. దీనివల్ల రైడింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు నేటి బైక్‌లలో సాధారణమయ్యాయి. డిజిటల్ స్క్రీన్ ద్వారా నావిగేషన్, కాల్స్, నోటిఫికేషన్లు చూడటంతో పాటు స్పీడ్, మైలేజ్, ఫ్యూయల్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story