ఎస్‌యూవీల జోరు.. హ్యాచ్‌బ్యాక్ ల బేజారు

Top 10 Cars : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఫిబ్రవరి 2026 నెల కార్ల విక్రయాల గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. ఎస్‌యూవీలు, కాంపాక్ట్ సెడాన్ల హవా కొనసాగుతుండగా.. టాప్-10 జాబితాలో ఉన్న కార్ల మొత్తం అమ్మకాలు 1,70,127 యూనిట్లుగా నమోదయ్యాయి. 2025 ఫిబ్రవరితో పోలిస్తే ఇది 8.76 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, జనవరి 2026 అమ్మకాలతో (1,80,798 యూనిట్లు) పోలిస్తే మాత్రం 5.9 శాతం తగ్గుదల కనిపించింది.

ఈ నెలలో టాటా నెక్సాన్ 19,430 యూనిట్ల అమ్మకాలతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే నెక్సాన్ అమ్మకాలు 26.59 శాతం పెరిగాయి. రెండో స్థానంలో నిలిచిన మారుతి డిజైర్ 19,326 యూనిట్లతో నెక్సాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఇక మూడో స్థానంలో టాటా పంచ్ 18,748 యూనిట్లతో దూసుకుపోతోంది. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో రెండింటిని టాటా మోటార్స్ దక్కించుకోవడం విశేషం.

హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా 17,938 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న మారుతి బ్రెజ్జా 17,863 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. త్వరలోనే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుండటంతో ఈ కారుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆరో స్థానంలో ఫ్యామిలీ కారు ఎర్టిగా 17,807 యూనిట్ల విక్రయాలతో నిలిచింది.

ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన మారుతి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ఈసారి ఏడు, ఎనిమిది స్థానాలకు పడిపోయాయి. వ్యాగన్ ఆర్ అమ్మకాలు ఏకంగా 25.12 శాతం పడిపోవడం గమనార్హం. తొమ్మిదో స్థానంలో మహీంద్రా స్కార్పియో 14,665 యూనిట్లతో నిలవగా, పదో స్థానంలో మారుతి బాలెనో 14,632 యూనిట్లతో సరిపెట్టుకుంది.

కంపెనీల పరంగా చూస్తే మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. టాప్-10లో ఆరు మోడళ్లు మారుతివే కావడం విశేషం. మొత్తం 99,346 యూనిట్ల అమ్మకాలతో మారుతి అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, వార్షిక వృద్ధి మాత్రం కేవలం 2.86 శాతానికే పరిమితమైంది. దీనికి కారణం డిజైర్, బ్రెజ్జా అమ్మకాలు పెరిగినా.. వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనోల అమ్మకాలు తగ్గడమే. మొత్తానికి కస్టమర్లు ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story