Car Secrets : సాధారణంగా మనం కారు కొనాలని ఆలోచించినప్పుడు దాని డిజైన్, మైలేజ్, మైక్రో ఫీచర్లు, ఇంజిన్ కెపాసిటీ, ధర గురించి మాత్రమే ఆలోచిస్తాం. అయితే ఒక కారును తయారుచేయడానికి కేవలం ఇనుము, అల్యూమినియం, ప్లాస్టిక్ మాత్రమే కాకుండా బంగారం, వెండి, ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రాగి, లిథియం వంటి అత్యంత ఖరీదైన లోహాలను కూడా ఉపయోగిస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇవి అతి తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ, కారు సాంకేతికంగా సరిగ్గా పనిచేయడానికి ఇవే కీలకం. అందుకే పాత మరియు స్క్రాప్ కార్లకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుంటుంది.

పొల్యూషన్‌ను తగ్గించే క్యాటలిటిక్ కన్వర్టర్..

కారు ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో ఉండే అత్యంత ముఖ్యమైన భాగం క్యాటలిటిక్ కన్వర్టర్. ఇందులో ప్లాటినం, పల్లాడియం, రోడియం వంటి అత్యంత ఖరీదైన లోహాలను అమర్చుతారు. ఇంజిన్ నుంచి వచ్చే విషపూరితమైన వాయువులను హాని లేని సాధారణ వాయువులుగా మార్చడమే వీటి పని. ఇవి వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి, ప్రభుత్వ వాహన ఉద్గార నియమాలకు అనుగుణంగా కారు పనిచేసేలా చేస్తాయి. ఇక్కడ వాడే లోహాలు అత్యంత ఖరీదైనవి కావడం గమనార్హం.

కారు ECUలో బంగారం, వెండి మెరుపులు

ఆధునిక కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) ఉంటుంది. దీనినే కారు మెదడు అని పిలుస్తారు. ఇంజిన్ పనితీరు, ఇంధన వినియోగం, సస్పెన్షన్, ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని ముఖ్యమైన సిస్టమ్‌లను ఈ ఇసియు పర్యవేక్షిస్తుంది. ఈ ECU మైక్రోచిప్‌లు, సర్క్యూట్ బోర్డులలో బంగారం, వెండి లోహాలను ఉపయోగిస్తారు. ఇవి విద్యుత్‌ను వేగంగా ప్రసారం చేయడమే కాకుండా, తుప్పు పట్టకుండా ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. అందువల్ల కారు ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఎలాంటి ఆటంకం లేకుండా సుదీర్ఘకాలం పనిచేస్తాయి.

స్పార్క్ ప్లగ్‌లు, భద్రతా వ్యవస్థల్లో ప్రీమియం మెటల్స్

కారును స్టార్ట్ చేయడంలో కీలకమైన స్పార్క్ ప్లగ్‌లలో ప్లాటినం, ఇరిడియం లోహాలను వాడతారు. ఎంతటి అధిక ఉష్ణోగ్రతనైనా తట్టుకునే శక్తి వీటికుండటం వల్ల ఇంజిన్ సులభంగా స్టార్ట్ అవ్వడమే కాకుండా, మైలేజ్, పర్‌ఫార్మెన్స్ పెరుగుతాయి. సాధారణ కార్లలో రాగి వాడితే, లగ్జరీ కార్లలో ప్లాటినం వినియోగిస్తారు. వీటితో పాటు కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, జిపిఎస్ కనెక్టివిటీ సర్క్యూట్లలో బంగారం, వెండి, రాగి ప్రసారక సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇవి ప్రమాద సమయంలో సెన్సార్లు క్షణాల్లో పనిచేసి ప్రయాణికులను కాపాడేలా చేస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story