Car Launch : స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ లగ్జరీ ప్లాన్.. త్వరలో రాబోతున్న 6 అదిరిపోయే మోడల్స్ ఇవే
త్వరలో రాబోతున్న 6 అదిరిపోయే మోడల్స్ ఇవే

Car Launch : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇన్నాళ్లూ బడ్జెట్ సెడాన్లు, ఎస్‌యూవీలపై దృష్టి సారించిన స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు ఇప్పుడు రూట్ మార్చాయి. సంపన్న కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తమ ప్రీమియం, హై-పర్ఫార్మెన్స్ కార్ల శ్రేణిని బలోపేతం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ రెండు కంపెనీల నుంచి రానున్న పవర్‌ఫుల్ కార్ల వివరాలు చూద్దాం.
1. స్కోడా ఆక్టావియా RS
గతేడాది ఆక్టావియా RS లాంచ్ చేసినప్పుడు, కేవలం 20 నిమిషాల్లోనే మొదటి బ్యాచ్‌లోని 100 కార్లు అమ్ముడయ్యాయి. దీనికి ఉన్న క్రేజ్ చూసి కంపెనీ రెండో బ్యాచ్‌ను సిద్ధం చేస్తోంది. రూ.49.99 లక్షల ధరతో రానున్న ఈ కారులో 2.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 బీహెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. కేవలం 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 13-అంగుళాల టచ్‌స్క్రీన్, 10 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ఏడీఏఎస్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
2. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI
హై-పర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ కావాలనుకునే వారి కోసం ఫోక్స్‌వ్యాగన్ తన గోల్ఫ్ GTI రెండో బ్యాచ్‌ను (150 కార్లు) తీసుకువస్తోంది. దీని ధర రూ.53 లక్షలుగా ఉండవచ్చు. ఇది కూడా 2.0 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది కానీ హ్యాచ్‌బ్యాక్ కావడం వల్ల ఆక్టావియా కంటే వేగంగా (5.9 సెకన్లలో) 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీనికి స్పెషల్ లుక్ ఇస్తాయి.
3. స్కోడా కోడియాక్ డీజిల్
ప్రస్తుతం స్కోడా వద్ద డీజిల్ కార్లు లేవు. అయితే, వినియోగదారుల కోరిక మేరకు తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కోడియాక్ లో 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజిన్‌ను మళ్లీ ప్రవేశపెట్టనుంది. ఇది 200 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారు ధర రూ.40-45 లక్షల మధ్య ఉండవచ్చు.
4. స్కోడా కోడియాక్ RS
జూన్ 2026 నాటికి కోడియాక్ లోనే అత్యంత పవర్‌ఫుల్ వెర్షన్ RS రాబోతోంది. దీని ధర రూ.55-60 లక్షల వరకు ఉండవచ్చు. ఇందులో 265 బీహెచ్‌పీ ఇంజిన్, 20-అంగుళాల చక్రాలు, స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్ ఉండబోతున్నాయి. వేగం, లగ్జరీ రెండూ కావాలనుకునే ఎస్‌యూవీ ప్రియులకు ఇది బెస్ట్ ఆప్షన్.
5. ఫోక్స్‌వ్యాగన్ టాయ్రోన్
ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే టాయ్రోన్ ఆర్-లైన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు కొంచెం తక్కువ ధరకు నాన్-ఆర్-లైన్ వెర్షన్‌ను 2026 రెండో త్రైమాసికంలో తీసుకువస్తోంది. దీని ధర రూ.40-45 లక్షల మధ్య ఉంటుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ ఇచ్చే 2.0 లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్‌తో వస్తుంది.
6. స్కోడా సూపర్బ్ డీజిల్
ఈ ఏడాది చివరలో స్కోడా తన విలాసవంతమైన సెడాన్ సూపర్బ్ కొత్త జనరేషన్‌ను విడుదల చేయనుంది. ఇందులో కూడా 2.0 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 188 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంగ్ జర్నీలు చేసే లగ్జరీ కార్ల ప్రియులకు ఇది ఎంతగానో నచ్చుతుంది.

