Car Safety : కారు నడుస్తున్నప్పుడు స్టార్ట్/స్టాప్ బటన్ నొక్కితే ఏమవుతుంది? డ్రైవర్లు తెలుసుకోవాల్సిన అసలు నిజం ఇదే
డ్రైవర్లు తెలుసుకోవాల్సిన అసలు నిజం ఇదే

Car Safety : నేటి మోడ్రన్ కార్లలో పాతకాలపు తాళం చెవుల బదులు ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్లు వస్తున్నాయి. ఇది కారును స్టార్ట్ చేయడం చాలా సులభతరం చేసింది. అయితే, ముఖ్యంగా కొత్త డ్రైవర్ల మనసులో ఒక భయం ఎప్పుడూ మెదులుతుంటుంది. అదేంటంటే.. కారు వేగంగా వెళ్తున్నప్పుడు పొరపాటున ఎవరైనా ఈ బటన్ నొక్కితే ఏమవుతుంది? కారు అక్కడికక్కడే ఆగిపోతుందా? బ్రేకులు ఫెయిల్ అవుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం ప్రతి డ్రైవర్‌కు చాలా ముఖ్యం.
మీరు కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు పొరపాటున లేదా సరదాగా ఒక్కసారి ఆ బటన్‌ను నొక్కి వదిలేస్తే ఏమీ జరగదు. ఎందుకంటే కార్ల తయారీ సంస్థలు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ముందుగానే ఊహించి, సేఫ్టీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తాయి. కారు వేగంగా వెళ్తున్నప్పుడు ఒకే ఒక ప్రెస్ వల్ల ఇంజిన్ ఆగిపోదు. అయితే, కొన్ని కార్లలో డాష్‌బోర్డ్ మీద వార్నింగ్ లైట్లు రావడం లేదా బీప్ సౌండ్ రావడం వంటివి జరగవచ్చు. ఇది కేవలం మిమ్మల్ని హెచ్చరించడానికే.
ఒక్కసారి నొక్కితే ఏమీ కాదు కదా అని ఎక్కువ సేపు నొక్కి ఉంచితే మాత్రం చిక్కుల్లో పడతారు. రన్నింగ్‌లో ఉన్న కారులో స్టార్ట్/స్టాప్ బటన్‌ను 2 నుంచి 3 సెకన్ల పాటు వరుసగా నొక్కి పట్టుకుంటే, కారు దానిని ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)గా భావిస్తుంది. అప్పుడు ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంజిన్ ఆగిపోగానే స్టీరింగ్ చాలా బరువుగా మారుతుంది. అలాగే బ్రేకులు కూడా గట్టిగా మారిపోతాయి. దీనివల్ల కారును కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది, ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు.
అసలు కంపెనీలు ఈ ఫీచర్ ఎందుకు ఇస్తాయి?
చలించే కారులో ఇంజిన్ ఆపడం ప్రమాదకరమే అయినా, కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణరక్షకమవుతుంది. ఉదాహరణకు, కారు ఎక్సలరేటర్ జామ్ అయిపోయినా లేదా బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయ్యి కారు ఆగకుండా వెళ్తున్నా.. ఈ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఇంజిన్ ఆపవచ్చు. దీనిని ఎమర్జెన్సీ కిల్ స్విచ్ అని కూడా అంటారు. అంటే ప్రమాదకర పరిస్థితుల్లో కారును బలవంతంగా ఆపడానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది.
డ్రైవర్లకు కొన్ని సూచనలు:
పిల్లలను జాగ్రత్తగా చూడండి: ముందు సీట్లో పిల్లలు ఉన్నప్పుడు ఈ బటన్‌ను ఆడుకుంటూ నొక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని గమనిస్తూ ఉండాలి.
బ్రేకులు వాడటం: ఒకవేళ అనుకోకుండా ఇంజిన్ ఆగిపోతే, కంగారు పడి స్టీరింగ్‌ను గట్టిగా తిప్పకండి. బ్రేక్‌ను గట్టిగా తొక్కి పట్టుకుని కారును రోడ్డు పక్కకు తీసుకురావడానికి ప్రయత్నించండి.
మెకానిజం అర్థం చేసుకోండి: ప్రతి కారు సిస్టమ్ వేరుగా ఉంటుంది. కొన్ని కార్లలో బటన్‌ను వరుసగా మూడుసార్లు నొక్కినా ఇంజిన్ ఆగిపోతుంది. అందుకే మీ కారు మ్యాన్యువల్ బుక్ చదివి పూర్తి అవగాహన పెంచుకోండి.

