Citroen : ఆకాశానికి సిట్రోయెన్ ధరలు..ఏకంగా రూ.45,000 పెంచుతూ కంపెనీ సంచలన నిర్ణయం
ఏకంగా రూ.45,000 పెంచుతూ కంపెనీ సంచలన నిర్ణయం

Citroen : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ తన కార్ల ధరలను పెంచుతూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఉత్పాదక ఖర్చుల దృష్ట్యా భారత మార్కెట్లో తన పాపులర్ మోడళ్లైన C3, ఎయిర్‌క్రాస్, బెసాల్ట్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు రూ.45,000 వరకు ఉంది. ఫిబ్రవరి నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. సిట్రోయెన్ ఇండియా తన లైనప్‌లోని దాదాపు అన్ని ప్రధాన మోడళ్లపై ధరలను సవరించింది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన సిట్రోయెన్ C3 ధర ఇప్పుడు రూ.4.95 లక్షల నుంచి రూ.9.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. లైవ్, ఫీల్, షైన్ వంటి వేరియంట్లలో లభించే ఈ కారుపై దాదాపు అన్ని మోడళ్లపై రూ.15,000 పెరిగింది. అయితే, లైవ్ (O) మాన్యువల్ వెర్షన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. బడ్జెట్ ధరలో మంచి కారు అనుకునే వారికి ఈ పెంపు కాస్త భారంగానే మారనుంది.
కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన స్టైలిష్ ఎస్‌యూవీ-కూపే బెసాల్ట్ ధరలపై కూడా కోత విధించింది. ఇప్పుడు బెసాల్ట్ ధర రూ.8.15 లక్షల నుంచి రూ.13.35 లక్షల మధ్య ఉంది. ఇందులో ఉన్న యు, ప్లస్, మ్యాక్స్ అనే మూడు వేరియంట్లపై సమానంగా రూ.20,000 చొప్పున పెంచారు. ఇకపోతే అత్యధికంగా ధర పెరిగింది మాత్రం సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ మీదనే. ఈ ఎస్‌యూవీ ధర మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ.45,000 వరకు పెరిగింది. ప్రస్తుతం దీని ధర రూ.8.49 లక్షల నుంచి రూ.13.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య పలుకుతోంది. 5-సీటర్ మ్యాక్స్ టర్బో వేరియంట్ ధరలో మాత్రం మార్పు లేదు.
ధరలు పెరిగినప్పటికీ, సాంకేతికంగా కార్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. మూడు కార్లలోనూ పాత ఇంజిన్ ఆప్షన్లే కొనసాగుతున్నాయి. ఒకటి 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (82 HP), ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెండోది 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ (110 HP), ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, హైవే ప్రయాణాలకు ఈ ఇంజిన్లు మంచి పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి.
కొనుగోలుదారులకు సూచన.. సిత్రోయెన్ కార్లు వాటి కంఫర్ట్ మరియు సస్పెన్షన్ సిస్టమ్‌కు గుర్తింపు పొందాయి. ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఇప్పటికీ వీటి ధరలు కొంత వరకు పోటీగానే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ధరల పెంపు వల్ల సేల్స్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. మీరు గనుక ఈ నెలలో కారు బుక్ చేసుకోవాలని అనుకుంటే, మీ సమీప డీలర్‌ను సంప్రదించి ఏవైనా పాత స్టాక్ ఆఫర్లు ఉన్నాయో లేదో వాకబు చేయడం మంచిది. ఎందుకంటే కొన్ని డీలర్‌షిప్‌లు పాత ధరలకే స్టాక్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది.

