బంగాళదుంప, షేవింగ్ క్రీమ్ తో తీసేయండి

Car Care Tips : శీతాకాలంలో కారు నడపడం ఒక ఎత్తు అయితే, అద్దాలపై పేరుకుపోయే పొగమంచును వదిలించుకోవడం మరో ఎత్తు. బయట చలిగా ఉండటం, కారు లోపల వేడి లేదా తేమ ఎక్కువగా ఉండటంతో విండ్‌షీల్డ్‌పై ఆవిరి పట్టేస్తుంది. దీనివల్ల ఎదురుగా ఉన్న రోడ్డు కనిపించక డ్రైవింగ్ చేయడం ప్రాణాంతకంగా మారుతుంది. చాలా మంది అద్దాన్ని చేత్తో లేదా గుడ్డతో తుడుస్తుంటారు.. కానీ దానివల్ల మచ్చలు పడి చూపు ఇంకా మసకబారుతుంది. అందుకే ఈ సమస్యను చిటికెలో పరిష్కరించే కొన్ని స్మార్ట్ టిప్స్ మీ కోసం ఇక్కడ ఉన్నాయి.

కారు అద్దాలపై ఫాగ్ కనిపించగానే చాలామంది చేసే పొరపాటు కారు విండోస్ మొత్తం క్లోజ్ చేసి ఉంచడం. అలా కాకుండా వెంటనే కారు ఏసీ (AC) ఆన్ చేయండి. ఉష్ణోగ్రతను కనిష్ట స్థాయికి తగ్గించి, ఫ్యాన్ స్పీడ్‌ను పెంచండి. గాలి నేరుగా విండ్‌షీల్డ్‌పై పడేలా అడ్జస్ట్ చేయండి. ఇలా చేస్తే కేవలం 20 నుంచి 30 సెకన్లలోనే అద్దం క్లియర్ అవుతుంది. ముఖ్యంగా రీసర్క్యులేషన్ మోడ్‎ను ఆఫ్ చేసి ఫ్రెష్ ఎయిర్ మోడ్‎ను ఆన్ చేయండి. దీనివల్ల లోపల ఉన్న తేమ బయటకు వెళ్లిపోతుంది.

హీటర్, డీఫ్రాస్టర్ వాడకం ఎలా?

చలి ఎక్కువగా ఉండి మీరు ఏసీ వేసుకోలేని పరిస్థితిలో ఉంటే, ఫ్రంట్ డీఫ్రాస్టర్ బటన్‌ను నొక్కండి. హీటర్‌ను హై స్పీడ్‌లో ఉంచి, గాలి అద్దం వైపు వచ్చేలా చూడండి. వేడి గాలి తగలగానే అద్దంపై ఉన్న తేమ ఆవిరైపోతుంది. వెనుక అద్దాన్ని క్లియర్ చేయడానికి 'రియర్ డీఫ్రాస్టర్' వాడండి. అయితే, ఒక్కసారి అద్దం క్లియర్ అయ్యాక టెంపరేచర్‌ను నార్మల్ చేయడం మర్చిపోవద్దు.

అద్భుతమైన దేశీ చిట్కాలు.. పొటాటో మ్యాజిక్

ఇంట్లో ఉండే వస్తువులతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక బంగాళదుంపను తీసుకుని దాన్ని సగానికి కోసి, దాని లోపలి భాగాన్ని అద్దం లోపలి వైపు రుద్దండి. ఆ తర్వాత పొడి గుడ్డతో మెల్లగా తూడ్చండి. బంగాళదుంపలోని స్టార్చ్ అద్దంపై ఒక పొరలా ఏర్పడి తేమను నిలవకుండా చేస్తుంది. అలాగే, కొద్దిగా షేవింగ్ క్రీమ్‌ను అద్దంపై రాసి క్లీన్ చేస్తే, చాలా సేపటి వరకు ఫాగ్ పట్టదు.

తేమను తగ్గించే మరిన్ని మార్గాలు..

కారు లోపల తేమను పీల్చుకోవడానికి సిలికా జెల్ ప్యాకెట్లు లేదా డీహ్యూమిడిఫైయర్ వాడటం మంచిది. రాత్రి పూట కారును పార్క్ చేసేటప్పుడు విండ్‌షీల్డ్‌పై సన్‌షేడ్ లేదా పాత దుప్పటి లాంటిది కప్పితే ఉదయాన్నే మంచు పేరుకుపోదు. డ్రైవింగ్ సమయంలో కిటికీలను కొద్దిగా కిందకు దించడం వల్ల లోపలి, బయటి ఉష్ణోగ్రతలు సమతుల్యమై ఫాగ్ రాకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ ప్రయాణాన్ని సుఖమయం చేస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story