ఆటో ఇండస్ట్రీలో అలజడి..పడిపోయిన ఉత్పత్తి

Auto Industry: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే 'రేర్ ఎర్త్ మాగ్నెట్స్'కొరత. దీనికి కారణం మన దేశంలోని సమస్య కాదు, చైనా విధించిన కొత్త ఎగుమతి ఆంక్షలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటో ఇండస్ట్రీలకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల (EVs) డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ కొరత ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అసలు ఈ మాగ్నెట్స్ అంటే ఏంటి? ఎందుకు ఇవి ముఖ్యమైనవి? భారత్‌కు దీని వల్ల వచ్చే నష్టం ఏంటి? అనేది వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అంటే ఏంటి?

నియోడిమియం (Neodymium - NdFeB), డిస్ప్రోసియం (Dysprosium), టెర్బియం (Terbium) వంటి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అరుదైన లోహాల నుండి తయారవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, హై-టెక్ మోటార్లు, బ్యాటరీ సిస్టమ్స్, సెన్సార్లు, డిఫెన్స్ టెక్నాలజీలో వీటిని ఉపయోగిస్తారు. ఒక్కో ఈవీ కారులో దాదాపు 1.5-2 కిలోల రేర్ ఎర్త్ మాగ్నెట్స్ అవసరం అవుతాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా ఇవి చాలా ముఖ్యమైనవి.

ఇప్పుడు ఏం జరిగింది?

చైనా ఏప్రిల్ 2025 నుండి ఈ ముఖ్యమైన మాగ్నెట్స్‌ ఎగుమతులపై కఠినమైన లైసెన్స్ నిబంధనలను అమలులోకి తెచ్చింది. భారత్, ఈ మాగ్నెట్స్‌ కోసం దాదాపు 100శాతం చైనాపైనే ఆధారపడి ఉంది. దీంతో మన దేశం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకుంది. చాలా కంపెనీల ఫ్యాక్టరీలు జూలై-ఆగస్టు నాటికి మూతపడవచ్చు.ఎందుకంటే వాటి వద్ద తగినంత స్టాక్ మిగలలేదు.

ఆటో ఇండస్ట్రీలో అలజడి ఎందుకు?

ఉత్పత్తి తగ్గింపు: మారుతి సుజుకి వంటి పెద్ద కంపెనీలు తమ ఈవీ ఉత్పత్తి లక్ష్యాలను భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మాగ్నెట్స్ అవసరమయ్యే హై-ఫీచర్స్ మోడల్స్ ఎక్కువగా ప్రభావితం అవుతాయి.

ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం: వాయివే మొబిలిటీ, బజాజ్ ఆటో ఇతర కంపెనీలు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం దొరకకపోతే ఈవీ అసెంబ్లీ లైన్లకు తాళాలు పడతాయని హెచ్చరించాయి.

గత తప్పు మళ్లీ జరుగుతుందా?

కోవిడ్-19 సమయంలో సెమీకండక్టర్ చిప్స్ కొరత ఏర్పడినప్పుడు ప్రపంచ ఆటో పరిశ్రమ నెలల తరబడి ఇబ్బందులు పడింది. ఇప్పుడు అలాంటి ప్రమాదమే మళ్లీ ఎదురవుతోంది. అయితే ఈసారి సంక్షోభం పేరు రేర్ ఎర్త్ మాగ్నెట్.

ఆందోళన ఎందుకు?

చైనా ఆధిపత్యం: ప్రపంచ రేర్ ఎర్త్ మాగ్నెట్ ఉత్పత్తిలో 90శాతం చైనాదే. అంటే, దాదాపు ప్రపంచం మొత్తం చైనాపైనే ఆధారపడి ఉంది.

ఉత్పత్తి లేకపోవడం: భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలను కలిగి ఉన్నప్పటికీ, మనం సొంతంగా ఉత్పత్తి చేయడం లేదు. దేశంలో ఉన్న ఏకైక కంపెనీ IREL (India Rare Earths Limited) కూడా ఈ రంగంలో పనిచేస్తున్నప్పటికీ, దాని ఉత్పత్తి సామర్థ్యం చాలా పరిమితం.

పరిష్కారం ఏమిటి?

ప్రభుత్వం చైనాతో దౌత్యపరమైన చర్చలు జరిపి లైసెన్సులను త్వరగా మంజూరు చేయించుకోవడానికి ప్రయత్నించాలి. తాత్కాలికంగా ఫెర్రైట్స్ (Ferrites) వంటి ప్రత్యామ్నాయ మాగ్నెట్స్‌ను ఉపయోగించవచ్చు. పాత వాహనాల నుండి మాగ్నెట్స్‌ను తిరిగి సేకరించి రీసైక్లింగ చేయడం కూడా ఒక పరిష్కారం.భారత్ సొంతంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తి చేసే సరఫరా గొలుసును అభివృద్ధి చేసుకోవాలి. కొత్త సాంకేతికతలను, డీప్-టెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story