Rear AC vs AC Vents : కారులో రియర్ ఏసీ వెర్సస్ ఏసీ వెంట్స్.. అసలు తేడా ఏంటి?
అసలు తేడా ఏంటి?

Rear AC vs AC Vents : కొత్త కారు కొనేటప్పుడు మనం ఫీచర్ల లిస్టును చూసి మురిసిపోతుంటాం. ముఖ్యంగా ఎండల కాలం దృష్ట్యా రియర్ ఏసీ ఉందో లేదో అని ఆరా తీస్తుంటాం. అయితే, ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తుంటారు. కార్ల కంపెనీలు రియర్ ఏసీ పేరుతో మనకు ఇచ్చేది అసలు ఏసీనా లేదా కేవలం గాలి గొట్టాలా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. చూడ్డానికి రెండూ ఒకేలా ఉన్నా, పనితీరులో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది.
అసలైన రియర్ ఏసీ అంటే ఏమిటి?
అసలైన రియర్ ఏసీ అంటే అది ఒక పూర్తి స్థాయి కూలింగ్ వ్యవస్థ. ఇందులో కేవలం గాలి వచ్చే రంధ్రాలు మాత్రమే ఉండవు. దీనికి విడిగా కూలెంట్ పైపులు, కూలింగ్ కాయిల్, ఒక సపరేట్ బ్లోయర్ ఫ్యాన్ ఉంటాయి. ఇది ముందున్న ఏసీతో సంబంధం లేకుండా వెనుక ప్రయాణీకులకు నేరుగా, అత్యంత వేగంగా చల్లటి గాలిని అందిస్తుంది. కొన్ని లగ్జరీ కార్లలో వెనుక కూర్చున్న వారు తమకు నచ్చిన ఉష్ణోగ్రతను సెట్ చేసుకునేలా సపరేట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల కారు మొత్తం నిమిషాల్లో చల్లబడిపోతుంది.
ఏసీ వెంట్స్ అంటే కేవలం గాలి గొట్టాలే
చాలా బడ్జెట్, మిడ్-రేంజ్ కార్లలో కంపెనీలు రియర్ ఏసీ పేరుతో కేవలం వెంట్స్ మాత్రమే ఇస్తాయి. వీటిలో ఎలాంటి కూలింగ్ మెకానిజం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే.. ముందు డాష్ బోర్డులో ఉండే ఏసీ నుంచి ఒక ప్లాస్టిక్ గొట్టాన్ని వెనుక సీటు వరకు వేస్తారు. ముందు వచ్చే చల్లటి గాలిని ఈ గొట్టం ద్వారా వెనుకకు పంపిస్తారు. దీనివల్ల గాలి వస్తుంది కానీ, ఆ గాలిలో ఉండే చల్లదనం వెనుకకు చేరేసరికి తగ్గిపోతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వెంట్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
తేడా ఎప్పుడు తెలుస్తుంది?
మీరు కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు లేదా మధ్యాహ్నం పూట కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ రెండింటి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. అసలైన రియర్ ఏసీ ఉన్న కారులో వెనుక కూర్చున్న వారు కూడా చలికి దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది. కానీ వట్టి వెంట్స్ ఉన్న కారులో ముందున్న వారికి చలి పుట్టి ఏసీ తగ్గిస్తారు, అప్పుడు వెనుక ఉన్న వారికి ఉక్కపోత మొదలవుతుంది. మీడియం కార్లలో ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీలు కేవలం ఈ వెంట్స్ వ్యవస్థనే ఇస్తుంటాయి.
కారు కొనే ముందు ఏం చేయాలి?
మీరు కొత్త కారు కొనడానికి షోరూమ్‌కు వెళ్ళినప్పుడు కేవలం బ్రోచర్ చూసి రియర్ ఏసీ ఉందని మురిసిపోకండి. అది సపరేట్ యూనిటా లేదా కేవలం డక్ట్/వెంట్ మాత్రమేనా అని సేల్స్ పర్సన్‌ను అడగండి. వీలైతే మధ్యాహ్నం ఎండలో టెస్ట్ డ్రైవ్ చేయండి. వెనుక సీట్లో కూర్చుని గాలి ఎంత చల్లగా వస్తుందో గమనించండి. కేవలం గాలి వస్తే సరిపోదు, ఆ గాలిలో చల్లదనం ఎంతుందో చూడాలి.

