Auto Sales: భారత ఆటోమొబైల్ మార్కెట్‌కు 2026 పండుగ సీజన్ అద్భుతంగా కలిసొచ్చింది. నవరాత్రి నుంచి ధనత్రయోదశి, దీపావళి వరకు జనం కొత్త వాహనాలు కొనడానికి ఎగబడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తాజా నివేదిక ప్రకారం.. 42 రోజుల పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 55,25,490 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 54,05,956 వాహనాలు అమ్ముడవ్వగా, ఈసారి అమ్మకాలు 2.21 శాతం పెరిగాయి. 2024తో పోలిస్తే ఏకంగా 23.95 శాతం వృద్ధి నమోదైంది. నవరాత్రి ఆరంభంలో మార్కెట్ కాస్త నెమ్మదిగా ఉన్నా, ధనత్రయోదశి, దీపావళి సమయంలో కొనుగోళ్లు పుంజుకుని సరికొత్త రికార్డు సృష్టించాయి.

ట్రాక్టర్లు, కమర్షియల్ వాహనాల జోరు

ఈ పండుగ సీజన్‌లో అత్యధికంగా టూ-వీలర్లే అమ్ముడయ్యాయి. మొత్తం 43,13,276 బైకులు, స్కూటర్లు విక్రయమై గతేడాది కంటే 3.67 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మూడు చక్రాల వాహనాలు (ఆటోలు) 5.32 శాతం పెరిగి 1,93,576 యూనిట్లు అమ్ముడయ్యాయి. ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాల అమ్మకాలు 7.13 శాతం పెరిగి 1,55,761 యూనిట్లకు చేరాయి. అలాగే ట్రాక్టర్ల విక్రయాలు 2.24 శాతం పెరిగి 1,03,809 యూనిట్లు కాగా, నిర్మాణ రంగ యంత్రాల అమ్మకాలు అత్యధికంగా 26.06 శాతం పెరిగి 10,452 యూనిట్లుగా నమోదయ్యాయి.

కార్ల అమ్మకాల్లో 7.16 శాతం తగ్గుదల

మిగతా విభాగాలన్నీ జోరు చూపిస్తే, ప్యాసింజర్ వాహనాలు అంటే కార్ల అమ్మకాల్లో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ పండుగ సీజన్‌లో 7,48,616 కార్లు అమ్ముడవ్వగా, గతేడాది 8,06,322 కార్లు విక్రయమయ్యాయి. అంటే కార్ల సేల్స్ 7.16 శాతం తగ్గాయి. గతేడాది జీఎస్టీ 2.0 కారణంగా కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉండటంతో, ఆ అధిక బేస్‌తో పోల్చడం వల్ల ఇప్పుడు తగ్గుదల కనిపిస్తోందని ఫాడా వివరించింది. నిజానికి నవరాత్రి సమయంలో కార్ల అమ్మకాలు 18 శాతానికి పైగా పడిపోయాయి, కానీ దీపావళికి డిమాండ్ పెరగడంతో ఆ నష్టం చాలా వరకు తగ్గింది.

తొలిసారి 5 లక్షలు దాటిన ఎలక్ట్రిక్ వాహనాలు

ఈ పండుగ సీజన్‌లో అసలైన హీరోలుగా ఎలక్ట్రిక్ వాహనాలు నిలిచాయి. దేశ చరిత్రలో తొలిసారిగా పండుగ సీజన్‌లో ఈవీ అమ్మకాలు 5 లక్షల మార్కును దాటి 5,09,667 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 52.62 శాతం ఎక్కువ. ప్రస్తుతం మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా 9.22 శాతానికి చేరింది.

ఈవీ కార్లు 72%, కమర్షియల్ ఈవీలు 154% జంప్

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రతీ సెగ్మెంట్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్లు 61.10 శాతం పెరిగి 3,30,846 యూనిట్లు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు 25.45 శాతం పెరిగి 1,20,330 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 72.91 శాతం దూసుకెళ్లి 52,104 యూనిట్లకు చేరాయి. అన్నింటికంటే వేగంగా ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలు 154.56 శాతం వృద్ధితో 6,387 యూనిట్లు విక్రయమై భవిష్యత్తు అంతా ఈవీలదేనని చాటిచెప్పాయి.

Next Story