మధ్యతరగతి జేబుకు తగ్గట్టుగా ఏ కారు బెస్ట్ అంటే?

Duster vs Creta : భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల మధ్య పోరు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో, లేటెస్ట్ టెక్నాలజీతో 2026 మోడల్‌గా తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చేందుకు డస్టర్ సిద్ధమైంది. కొత్త తరం ప్లాట్‌ఫారమ్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లు, ఏడీఏఎస్ వంటి ఫీచర్లతో వస్తున్న డస్టర్, క్రెటా సామ్రాజ్యాన్ని ఏ మేరకు ఢీకొంటుందో తెలుసుకుందాం.

ధరల యుద్ధం

ధర విషయంలో ఈ రెండు కార్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌లో రూ.20.20 లక్షల వరకు ఉంటుంది. దీనికి పోటీగా రెనాల్ట్ డస్టర్ 2026 ధరను కంపెనీ చాలా తెలివిగా నిర్ణయించింది. డస్టర్ ప్రారంభ ధర రూ.10.29 లక్షల నుంచి రూ.18.49 లక్షల మధ్య ఉండబోతోంది. అంటే క్రెటా కంటే డస్టర్ కొంత తక్కువ ధరకే లభిస్తూ, బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

ఇంజన్ సామర్థ్యం, హైబ్రిడ్ టెక్నాలజీ

హ్యుందాయ్ క్రెటా మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో (పెట్రోల్, డీజిల్, టర్బో-పెట్రోల్) కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే, కొత్త డస్టర్ కేవలం పెట్రోల్, హైబ్రిడ్ వెర్షన్లలోనే అందుబాటులోకి వస్తోంది. ఇందులో 1.0 లీటర్ టర్బో, 1.3 లీటర్ టర్బో ఇంజన్లతో పాటు 1.8 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది. మైలేజ్ కోరుకునే వారికి ఈ హైబ్రిడ్ వెర్షన్ ఒక వరం లాంటిది. క్రెటాకు డీజిల్ ఇంజన్ ప్లస్ పాయింట్ అయితే, డస్టర్‌కు దాని ఆఫ్-రోడ్ సామర్థ్యం, గ్రౌండ్ క్లియరెన్స్ అతిపెద్ద బలం.

హై-టెక్ ఫీచర్ల మేళవింపు

ఫీచర్ల విషయంలో రెండు కార్లు దేనికవే సాటి. హ్యుందాయ్ క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి ధీటుగా రెనాల్ట్ డస్టర్ 2026లో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, గూగుల్ ఆధారిత కనెక్టెడ్ టెక్నాలజీని అందించారు. ముఖ్యంగా డస్టర్ కేబిన్ మునుపటి కంటే చాలా ప్రీమియంగా మరియు సౌకర్యవంతంగా రూపుదిద్దుకుంది.

సేఫ్టీలో తగ్గేదే లే

ప్రస్తుతం వాహనదారులకు సేఫ్టీ అత్యంత ముఖ్యం. హ్యుందాయ్ క్రెటాలో 70 కి పైగా భద్రతా ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ ఉన్నాయి. కొత్త రెనాల్ట్ డస్టర్ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీల కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్ వంటి 17 రకాల ఏడీఏఎస్ ఫంక్షన్లు ఉన్నాయి. ఈ ఆధునిక ఫీచర్ల వల్ల ఇప్పుడు డస్టర్, క్రెటా సేఫ్టీ విషయంలో దాదాపు ఒకే స్థాయిలో నిలుస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story