Renault: భారత వాహన రంగంలో ఎస్‌యూవీ కార్లకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకునేందుకు రెనాల్ట్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. హుందాయ్, టోయోటా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా సరికొత్త హైబ్రిడ్ సాంకేతికతతో కొత్త తరం డస్టర్‌ను, 7 సీటర్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పెట్రోల్ కాంబినేషన్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ టెక్నాలజీకి కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో, కంపెనీ హైబ్రిడ్ వాహనాలపై ప్రధానంగా దృష్టి సారించింది. పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, మైలేజీని పెంచడమే లక్ష్యంగా కొత్త మోడళ్లను తీర్చిదిద్దుతోంది. పూర్తిస్థాయి ఈవీల వైపు వెళ్లకుండానే పర్యావరణహిత ప్రయాణాన్ని అందించడం ఈ వ్యూహం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

పవర్ ఫుల్ డస్టర్ హైబ్రిడ్ రీ-ఎంట్రీ

రెనాల్ట్ గ్రూప్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ (ఆర్‌జిఎమ్‌పి) ప్రాతిపదికన రాబోయే కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీ అత్యంత కీలకమైనదిగా మారనుంది. ఈ మోడల్‌లో 1.8 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అందించే అవకాశం ఉంది. ఒక మోటార్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడితే, మరొకటి చక్రాలను తిప్పడానికి తోడ్పడుతుంది. 1.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ సపోర్ట్‌తో పనిచేసే ఈ సిస్టమ్ ఏకంగా 160 హెచ్‌పీ పవర్‌ను, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే మిడ్-సైజ్ ఎస్‌యూవీ కేటగిరీలో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలుస్తుంది.

పెద్ద కుటుంబాల కోసం 7 సీటర్ ఎస్‌యూవీ

కేవలం డస్టర్ మాత్రమే కాకుండా, పెద్ద కుటుంబాలను ఆకట్టుకోవడానికి మూడు వరుసల సీటింగ్ సామర్థ్యం కలిగిన 7 సీటర్ ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆర్‌జిఎమ్‌పి ప్లాట్‌ఫామ్‌పైనే రూపుదిద్దుకునే ఈ కారు డస్టర్‌తో అనేక ఫీచర్లను పంచుకోనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దీనికి బిగ్‌స్టర్ లేదా బోరియల్ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో కూడా 160 హెచ్‌పీ శక్తినిచ్చే 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది.

2027 నాటికి బ్రిడ్జర్ ఎస్‌యూవీ రాక

రెనాల్ట్ హైబ్రిడ్ ప్రణాళికలు డస్టర్, 7 సీటర్ మోడళ్లతో ముగిసిపోవు. 2027 నాటికి బ్రిడ్జర్ పేరుతో కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత 2028-29 నాటికి దీని హైబ్రిడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. సరైన ధర, అత్యుత్తమ ఫీచర్లు, గరిష్ఠ మైలేజ్ అందించడం ద్వారా ఇండియాలో కోల్పోయిన మార్కెట్ వాటాను తిరగరాయాలని రెనాల్ట్ గట్టి పట్టుదలతో ఉంది.

Next Story