Renault Duster : భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో వచ్చి మార్కెట్‌ను షేక్ చేస్తోంది. థర్డ్ జనరేషన్ డస్టర్ లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే కస్టమర్లను ఫిదా చేస్తూ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ కారు రాకతో రెనాల్ట్ ఇండియా దశ తిరిగిందని చెప్పవచ్చు. ఏప్రిల్ 2026 నాటి అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, ఈ ఫ్రెంచ్ కంపెనీ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలకు ఈ కారు గట్టి పోటీని ఇస్తోంది.

రెనో ఇండియా ఏప్రిల్ 2026లో ఏకంగా 5,413 వాహనాలను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది ఏప్రిల్ 2025లో ఈ అమ్మకాలు కేవలం 2,602 యూనిట్లు మాత్రమే ఉండేవి. అంటే ఏడాది కాలంలో కంపెనీ 108 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది. గత 36 నెలల్లో (మూడేళ్లలో) రెనాల్ట్ నమోదు చేసిన అత్యధిక నెలవారీ విక్రయాలు ఇవే కావడం విశేషం. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ సాధించిన మొత్తం విక్రయాల్లో కేవలం కొత్త డస్టర్ వాటానే 36 శాతంగా ఉండటం దీని క్రేజ్‌కు అద్దం పడుతోంది.

కస్టమర్ల నుంచి వస్తున్న విపరీతమైన స్పందనను చూసి రెనాల్ట్ కంపెనీ చెన్నైలోని తన ప్లాంట్‌లో ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఏప్రిల్ నెలలో ఏకంగా 4,466 డస్టర్ కార్లను తయారు చేశారు. ఇది మార్చి నెల ఉత్పత్తి కంటే 140 శాతం ఎక్కువ. కంపెనీ మొత్తం తయారు చేసిన వాహనాల్లో దాదాపు సగం వాటా డస్టర్‌దే కావడం గమనార్హం. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 10.49 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ రూ.18.49 లక్షల వరకు ఉంది. రోడ్డుపైకి వచ్చేసరికి సుమారు రూ. 12.43 లక్షల నుంచి ఈ కారు అందుబాటులో ఉంటుంది.

కొత్త డస్టర్ కేవలం లుక్స్‌లో మాత్రమే కాదు, భద్రతలోనూ సూపర్ అనిపించుకుంది. ఇటీవల నిర్వహించిన భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో 17 రకాల అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా సురక్షితంగా మారుతుంది. ఇంజిన్ పరంగా 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా, 2026 నవంబర్ నాటికి 1.8 లీటర్ పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయడానికి రెనాల్ట్ సిద్ధమవుతోంది.

మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో డస్టర్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఇది మార్కెట్ లీడర్లు అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగున్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పాత డస్టర్ లాగే ఇది కూడా మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో అడ్వెంచర్ ఇష్టపడే వారు దీనికోసం క్యూ కడుతున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే రెనాల్ట్ ఇండియా టాప్ కంపెనీల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story