ఒక్క నెలలోనే రికార్డులు బద్ధలు

Renault : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా 2026 సంవత్సరాన్ని అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభించింది. గత కొంతకాలంగా అమ్మకాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ కంపెనీ, ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా భారతీయుల ఫేవరెట్ ఎస్‌యూవీ డస్టర్ కొత్త అవతారంలో తిరిగి రావడంతో రెనాల్ట్ షోరూమ్‌ల వద్ద సందడి మొదలైంది. జనవరి 2026లో కంపెనీ ఏకంగా 33.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచింది.

రెనాల్ట్ ఇండియా తన అమ్మకాల్లో వేగాన్ని పెంచింది. 2026 జనవరి నెలలో ఈ కంపెనీ మొత్తం 3,715 యూనిట్ల విక్రయాలను జరిపింది. 2025 జనవరిలో ఇవి కేవలం 2,780 యూనిట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఏడాది తిరిగేసరికి 33.6 శాతం వృద్ధిని సాధించింది. ఇది మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమ సగటు వృద్ధి కంటే చాలా ఎక్కువ. ఈ విజయంతో కంపెనీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రెనాల్ట్ విజయ యాత్రలో ఆ కంపెనీకి చెందిన ట్రైబర్, కైగర్ కార్లు వెన్నెముకగా నిలిచాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన 7-సీటర్ ట్రైబర్, యువతను ఆకట్టుకునే స్టైలిష్ ఎస్‌యూవీ కైగర్ కలిసి 45.3 శాతం వృద్ధిని సాధించాయి. 2025 ద్వితీయార్ధంలో వీటిలో తెచ్చిన కొత్త అప్‌డేట్స్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండటమే ఈ కార్ల సక్సెస్ సీక్రెట్ అని కంపెనీ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో హిడాల్గో పేర్కొన్నారు.

భారతదేశంలో ఎస్‌యూవీ ట్రెండ్‌కు బీజం వేసిన ఐకానిక్ కారు డస్టర్. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రెనో తన న్యూ-జనరేషన్ డస్టర్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఇది కంపెనీ గ్లోబల్ ప్లాన్ 2027లో భాగంగా వస్తున్న తొలి కారు. విశేషమేమిటంటే, ఈ కారులోని 90 శాతం విడిభాగాలను భారతీయ రోడ్లు, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఇక్కడే డిజైన్ చేశారు. 700 లీటర్ల భారీ బూట్ స్పేస్, గూగుల్ బిల్ట్-ఇన్ సపోర్ట్, ఓపెన్-ఆర్ లింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి 14 అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త డస్టర్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. ఇందులో అత్యంత ప్రత్యేకమైనది హైబ్రిడ్ ఇంజిన్. ఇది 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది సిటీ డ్రైవింగ్‌లో అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. అలాగే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ప్రమాణాలతో వస్తున్న ఈ కారు, భద్రత విషయంలో రాజీపడని కస్టమర్ల మొదటి ఎంపికగా మారబోతోంది. ఆఫ్‌-రోడింగ్ ప్రియుల కోసం ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా భారీ నెట్‌వర్క్ రెనాల్ట్ కు చెన్నైలో భారీ తయారీ కేంద్రం ఉంది, దీని వార్షిక సామర్థ్యం 4.8 లక్షల యూనిట్లు. అలాగే దేశవ్యాప్తంగా 350కి పైగా సేల్స్ పాయింట్లు, 450కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కారు చెడిపోతే డోర్ స్టెప్ సర్వీస్ ఇచ్చే 'వర్క్‌షాప్ ఆన్ వీల్స్' సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. డస్టర్ రాకతో రెనాల్ట్ మళ్ళీ భారత మార్కెట్లో తన పాత వైభవాన్ని చాటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story