Renault:రెనాల్ట్ నుంచి ఊహించని బిగ్ ప్లాన్.. 2027 నాటికి భారత రోడ్లపై 4 కొత్త కార్లు
2027 నాటికి భారత రోడ్లపై 4 కొత్త కార్లు

Renault: భారత కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2027 నాటికి నాలుగు సరికొత్త మోడళ్లను భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్, సిఎన్‌జి మోడళ్లతో పాటు పవర్ ఫుల్ ఈవి, హైబ్రిడ్ వాహనాలు ఇందులో ఉండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభించిన గ్లోబల్ వ్యూహంలో భాగంగా రెనాల్ట్ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా 7 కొత్త మోడళ్లు, రెండు సరికొత్త ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేస్తోంది. 2026 దీపావళి పండుగ సమయానికి డస్టర్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కారులో 1.8-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చనున్నారు. ఇ-టెక్ పేరుతో వస్తున్న ఈ వ్యవస్థ 160 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ టాపింగ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫోర్ములా 1 రేసింగ్ అనుభవాలతో ఈ రేంజ్ సాంకేతికతను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ డస్టర్
భారతదేశంలో ఎక్కువమంది ప్రయాణించే కుటుంబాల కోసం 7-సీటర్ డస్టర్ మోడల్‌ను కూడా రంగంలోకి దించుతున్నారు. ఇదివరకే మార్కెట్లో ఉన్న 5-సీటర్ డస్టర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే దీనిని నిర్మిస్తారు. ఇంజిన్ రకం, లోపలి డిజైన్, ప్రధాన ఫీచర్లు రెండింటిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. కాకపోతే మూడో వరుస సీట్ల కోసం వీలుగా ఈ వాహనం పొడవును కాస్త పెంచుతున్నారు. పెద్ద కుటుంబాలకు సుదూర ప్రయాణాల్లో ఇది అద్భుతమైన ఎస్‌యూవీగా మారనుంది.
కాంపాక్ట్ సెగ్మెంట్‌లో తుఫాన్ రేపే బ్రిడ్జర్ ఎస్‌యూవీ
సబ్-4 మీటర్ విభాగంలో పట్టు సాధించేందుకు బ్రిడ్జర్ పేరుతో ఒక కొత్త చిన్న ఎస్‌యూవీని రెనాల్ట్ డిజైన్ చేస్తోంది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల అవసరాలకు తగినట్లు ఆర్-జిఎమ్‌పి ప్లాట్‌ఫారమ్‌పై దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో పెట్రోల్ వర్షన్‌తో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీని పెట్రోల్ వెర్షన్‌లో కైగర్ కారుకు వాడిన ఇంజిన్ సాంకేతికతనే ఉపయోగించే అవకాశముంది. బాక్సీ షేప్‌లో ఎత్తైన డిజైన్‌తో ఇది చూడటానికి ఎంతో రఫ్‌గా కనిపిస్తుంది.
సరికొత్త అవతారంలో క్విడ్ ఫేస్‌లిఫ్ట్
కంపెనీకి అత్యధిక విక్రయాలు తెచ్చిపెట్టిన చిన్న కారు క్విడ్ మోడల్‌ను కూడా సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే దీని రోడ్ టెస్టింగ్ ప్రారంభమైంది. 2027 చివరి నాటికి ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. క్విడ్ ఇ-టెక్ డిజైన్ ఆధారంగా కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అధునాతన హెడ్‌లాంప్స్ దీనికి జోడిస్తున్నారు. లోపలి భాగంలో కొత్త టిఎఫ్టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అనేక కొత్త సౌకర్యాలు రానున్నాయి. చిన్న హాచ్‌బ్యాక్ నుంచి లగ్జరీ హైబ్రిడ్ ఎస్‌యూవీ వరకు అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేలా రెనాల్ట్ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తోంది.

