కస్టమర్లంతా రెనాల్ట్ షోరూమ్‌లకే

Renault Triber : భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే కార్లకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలున్న 7-సీటర్ కార్ల కోసం సామాన్యులు క్యూ కడుతుంటారు. ఈ విభాగంలో ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ తన హవాను కొనసాగిస్తోంది. జనవరి 2026 నెలవారీ అమ్మకాల లెక్కలను గమనిస్తే, రెనాల్ట్ సంస్థకు చెందిన ట్రైబర్ అమ్మకాల్లో దుమ్మురేపింది. కేవలం రూ.6 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ 7-సీటర్ కారును కొనేందుకు కస్టమర్లు పోటీ పడ్డారు. దీని ఫలితంగా రెనాల్ట్ మొత్తం అమ్మకాల్లో ఈ ఒక్క కారు వాటానే ఏకంగా 68 శాతం ఉండటం విశేషం.

జనవరి 2026లో రెనాల్ట్ ట్రైబర్ మొత్తం 2,509 యూనిట్ల అమ్మకాలతో తన సెగ్మెంట్‌లో నంబర్-1 పొజిషన్‌ను కైవసం చేసుకుంది. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) ఈ కారు కేవలం 1,456 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఏడాది కాలంలో ట్రైబర్ అమ్మకాలు ఏకంగా 72.32 శాతం పెరిగాయి. భారతదేశంలో అత్యంత చవకైన 7-సీటర్ కారుగా పేరు తెచ్చుకున్న ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.5.76 లక్షలుగా ఉంది. మైలేజీ, స్పేస్, ధరకు తగ్గ విలువను అందించడం వల్లే ఈ కారుకు ఇంతటి ఆదరణ లభిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమ్మకాల జాబితాలో రెనాల్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో 703 మంది కొత్త కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. అయితే, గతేడాది జనవరితో పోలిస్తే కైగర్ అమ్మకాల్లో 6.89 శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక మూడో స్థానంలో ఉన్న రెనాల్ట్ క్విడ్ 503 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. క్విడ్ అమ్మకాలు కూడా గతేడాదితో పోలిస్తే 11.60 శాతం తగ్గాయి. రెనాల్ట్ అమ్మకాల్లో ట్రైబర్ వాటా 67.54 శాతం ఉండగా, కైగర్ 18.92 శాతం మరియు క్విడ్ 13.54 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

కేవలం ట్రైబర్ అందించిన ఊపుతో రెనాల్ట్ సంస్థ ఓవరాల్ అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించింది. జనవరి 2026లో భారత మార్కెట్లో రెనాల్ట్ మొత్తం 3,715 వాహనాలను విక్రయించింది. 2025 జనవరిలో ఈ సంఖ్య 2,780 యూనిట్లుగా మాత్రమే ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన కంపెనీ మొత్తం అమ్మకాలు 33.63 శాతం పెరిగాయి. మార్కెట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ, తన బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లతో రెనాల్ట్ తన పట్టును నిరూపించుకుంది.

సాధారణంగా 7-సీటర్ కారు కావాలంటే కనీసం ₹10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ రెనాల్ట్ ట్రైబర్ సుమారు రూ.6 లక్షల లోపే (బేస్ మోడల్) వస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది వరంగా మారింది. ఇందులో సీట్లను అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే సదుపాయం ఉండటం మరొక ప్లస్ పాయింట్. సేఫ్టీ విషయంలో కూడా గ్లోబల్ క్రాష్ టెస్టుల్లో మంచి రేటింగ్ సాధించిన ఈ కారు, ఇప్పుడు భారతీయ రోడ్లపై తిరుగులేని విజేతగా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story