రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది

Renault Triber : భారత మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ 2025ను రెనాల్ట్ ఇండియా ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ అప్‌డేటెడ్ ఎంపీవీ సరికొత్త ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్‌కు రూ.8.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. తక్కువ ధరలో 7 సీటర్ కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని రెనాల్ట్ తెలిపింది.

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ముందు, వెనుక భాగాలలో గణనీయమైన మార్పులు చేశారు. ముందు భాగంలో బ్లాక్ స్లాట్స్ తో కూడిన కొత్త గ్రిల్, మధ్యలో సరికొత్త రెనాల్ట్ లోగో ఉన్నాయి. కొత్త డైమండ్ లోగోతో భారత మార్కెట్లో విడుదలైన మొదటి రెనాల్ట్ కారు ఇదే కావడం విశేషం. బంపర్‌ను పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌తో మార్చారు, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ను కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లతో అప్‌డేట్ చేశారు.

వెనుక భాగంలో మధ్యలో కొత్త బ్లాక్ అప్లిక్‌ను జోడించారు. టెయిల్ లైట్లలో కూడా మార్పులు చేశారు. బంపర్‌లో కొత్త సిల్వర్ యాక్సెంట్స్‌ తో పాటు ఇతర చిన్నపాటి మార్పులు కూడా ఉన్నాయి. ఈ మోడల్‌కు కొత్త డిజైన్ వీల్స్ ను కూడా అమర్చారు. ఇవి వాహనానికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌లో కూడా చిన్నపాటి మార్పులు చేశారు. కొత్త డిజిటల్ కన్సోల్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఇంటీరియర్‌కు కొత్తదనాన్ని ఇస్తాయి. కంపెనీ తన మూడు-వరుసల సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను అలాగే ఉంచింది. ఇది ట్రైబర్‌ను ఇంత తక్కువ ధరలో లభించే ఏకైక ఏడు సీట్ల సబ్‌కాంపాక్ట్ కారుగా నిలుపుతుంది. ఇతర మార్పులలో క్యాబిన్‌లో కొత్త ఫ్యాబ్రిక్ అప్హోల్స్టరీ, కొత్త మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల మరింత ప్రీమియం ఫీలింగ్ లభిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ 71 బీహెచ్‌పీ పవర్, 96 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది. భారత మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగాకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెంట్, మారుతి బాలెనో, స్విఫ్ట్ వంటి కార్లతో కూడా పోటీ పడుతుంది. ఎందుకంటే అవి ఇదే ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే, మారుతి సుజుకి ఎర్టిగా ప్రారంభ ధర రూ.8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై, టాప్ మోడల్‌కు రూ.13.26 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు ఎర్టిగా కంటే తక్కువగా ఉండటం వల్ల తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‎గా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story