Renault : భారత మార్కెట్లోకి రెనాల్ట్ గ్రాండ్ రీ-ఎంట్రీ.. గడగడలాడించనున్న 6 సరికొత్త ఎస్‌యూవీలు
6 సరికొత్త ఎస్‌యూవీలు

Renault : ఫ్రెంచ్ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ రెనాల్ట్ భారతీయ మార్కెట్లో తన పట్టును మళ్లీ బిగించేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది. సరికొత్త జనరేషన్ డస్టర్ కారుతో భారత్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా మారేందుకు ఏకంగా 6 కొత్త మోడళ్లను లైన్లో పెట్టింది. కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఈ కార్లను డిజైన్ చేసింది.
మైలేజ్ కింగ్ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్
న్యూ జనరేషన్ డస్టర్ సక్సెస్ తర్వాత, రెనాల్ట్ కంపెనీ 2026 దీపావళి నాటికి డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారులో 1.8-లీటర్ పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో 80 శాతం వరకు ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుందని కంపెనీ చెబుతోంది. దీనివల్ల లీటరుకు ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజీ రానుంది. ఇందులో లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చు.
పెద్ద కుటుంబాల కోసం రెనాల్ట్ బొరెల్ (7-Seater)
మధ్యతరగతి పెద్ద కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. డస్టర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా 3-రో ఎస్‌యూవీ అయిన రెనాల్ట్ బొరెల్ ను 2026 చివరి నాటికి రెనాల్ట్ లాంచ్ చేయనుంది. 4.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, 2702 ఎంఎం భారీ వీల్‌బేస్‌తో రాబోతున్న ఈ 7-సీటర్ కారులో 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 163 bhp పవర్‌ను అందిస్తుంది. ఇందులో హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్, మసాజ్ ఫంక్షన్ సీట్లు, గూగుల్ ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 23 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
బొరెల్ హైబ్రిడ్ వర్షన్ కూడా రెడీ
బొరెల్ స్టాండర్డ్ మోడల్ లాంచ్ అయిన తర్వాత, 2027 లో దీని బొరెల్ హైబ్రిడ్ వర్షన్‌ను కూడా రెనాల్ట్ పరిచయం చేయనుంది. ఇందులో కూడా న్యూ డస్టర్‌లో వాడిన 1.8-లీటర్ ఈ-టెక్ హైబ్రిడ్ ఇంజిన్‌నే వాడనున్నారు. 7-సీటర్ కార్లలో ఎక్కువ మైలేజ్ ఆశించే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. దీని ధర సుమారు రూ. 22 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా.
టాటా నెక్సాన్‌కు పోటీగా రెనాల్ట్ బ్రిడ్జర్
భారత్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెనాల్ట్ బ్రిడ్జర్ కారును 2027 లో లాంచ్ చేయనున్నారు. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. సరికొత్త ఆర్‌జీఎమ్‌పీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ఈ కారులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బెస్ట్ సేఫ్టీ ప్యాకేజీతో రానున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపే ఉండటం విశేషం.
ఎలక్ట్రిక్ మార్కెట్లోకి బ్రిడ్జర్ ఈవీ (EV)
పెట్రోల్ వర్షన్ బ్రిడ్జర్ తర్వాత, రెనాల్ట్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం బ్రిడ్జర్ ఈవీని కూడా లైన్లోకి తెస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఈవీ కార్లకు ఇది గట్టి ఫైట్ ఇస్తుందని టాక్. సాఫ్ట్‌వేర్ బేస్డ్ ఫీచర్లు, బిగ్గర్ కేబిన్, ఓటీఏ అప్‌డేట్స్ వంటి మోడ్రన్ టెక్నాలజీతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 13 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రిడ్జర్ హైబ్రిడ్
ఎలక్ట్రిక్ కార్లకు ఇంకా మారకూడదు కానీ ఎక్కువ మైలేజ్ కావాలి అనుకునే వారి కోసం బ్రిడ్జర్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా 2027-28 నాటికి రెనాల్ట్ తీసుకురానుంది. 1.2-లీటర్ హైబ్రిడ్-రెడీ పెట్రోల్ ఇంజిన్, చిన్న ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీతో రాబోతున్న ఈ కారు, భారతదేశంలోనే అత్యంత చౌకైన హైబ్రిడ్ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించనుంది. దీని ధర రూ. 12 లక్షల నుంచి రూ. 17 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.

