Renault : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత్‌పై తనకున్న మక్కువను మరోసారి చాటుకుంది. కేవలం ఇక్కడ కార్లను అమ్మడమే కాకుండా, మన దేశాన్ని ప్రపంచ స్థాయి ఎక్స్‌పోర్ట్ హబ్ గా మార్చాలని రెనాల్ట్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే 2026-27 నాటికి మూడు సరికొత్త ఎస్‌యూవీ (SUV)లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.18,000 కోట్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్న రెనాల్ట్, భారత రోడ్లపై తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

రెనాల్ట్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డస్టర్ హైబ్రిడ్ 2026 దీపావళి నాటికి మార్కెట్లోకి రానుంది. ఇందులో 1.8 లీటర్ల శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఒక మోటార్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి జనరేటర్‌లా పనిచేస్తే, మరో 149bhp మోటార్ కారును వేగంగా నడిపిస్తుంది. మొత్తంగా 160bhp పవర్‌ను ఇచ్చే ఈ కారు, అద్భుతమైన మైలేజీతో పాటు ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణాన్ని అందిస్తుంది.

7-సీటర్ రెనాల్ట్ డస్టర్

పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెనాల్ట్ డస్టర్ లోనే 7-సీటర్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. ఇది సుమారు 4,556 మి.మీ పొడవుతో చాలా విశాలంగా ఉండబోతోంది. దీని డిజైన్ డెసియా బిగెస్టర్ నుంచి స్ఫూర్తి పొందింది. కేవలం సీట్లు పెంచడమే కాకుండా, కారు లోపల ప్రీమియం ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్‌ను అందించబోతున్నారు. లాంచ్ సమయంలో దీనికి సరికొత్త పేరు పెట్టే అవకాశం కూడా ఉందని సమాచారం.

రెనాల్ట్ బ్రిజర్

2027లో రాబోతున్న రెనాల్ట్ బ్రిజర్, తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ అనుభూతిని ఇస్తుంది. ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ పడుతుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పెట్రోల్, సీఎన్‌జీ , హైబ్రిడ్ , ఎలక్ట్రిక్.. ఇలా అన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో 35kWh నుంచి 55kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది.

భారత్ ఎక్స్‌పోర్ట్ హబ్

రెనాల్ట్ సంస్థ కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా, భారత్‌ను తన గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా మార్చాలని భావిస్తోంది. 2030 నాటికి ప్రతి ఏటా రూ. 18,000 కోట్ల విలువైన కార్లను, విడిభాగాలను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, మన ఆటోమొబైల్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. రాబోయే 7 కొత్త మోడళ్లు భారత మార్కెట్ గమనాన్ని మార్చబోతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story