Royal Enfield : దుమ్ములేపుతున్న బుల్లెట్ బండి.. 12 లక్షల మంది బుక్ చేసేసుకున్నారు భయ్యా
12 లక్షల మంది బుక్ చేసేసుకున్నారు భయ్యా

Royal Enfield : భారతీయ రోడ్ల మీద గంభీరంగా గర్జించే రాయల్ ఎన్‌ఫీల్డ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా అడ్వెంచర్ ప్రియుల ఫేవరెట్ బైక్ హిమాలయన్ 450 గ్లోబల్ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. ఒకప్పుడు బుల్లెట్ అంటే కేవలం ఒక బైక్ మాత్రమే అనుకునేవారు, కానీ ఇప్పుడు అది ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగి విదేశీయులను సైతం ఫిదా చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి 2026 ఆర్థిక సంవత్సరం ఒక స్వర్ణయుగంలా నిలిచిపోయింది. ఈ ఏడాది మొత్తం 12.38 లక్షల బైక్‌లను విక్రయించి కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గత ఏడాది (FY25) అమ్మకాలు 10.09 లక్షలుగా ఉండగా, ఈసారి ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం భారత్‌లోనే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పట్టును నిరూపించుకుంది. ఎగుమతులు కూడా 23 శాతం పెరిగి 1.31 లక్షల యూనిట్లకు చేరాయి.
ఈ సక్సెస్‌లో మెయిన్ హీరో ఎవరంటే అది ఖచ్చితంగా హిమాలయన్ 450 అని చెప్పాలి. ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా 38,000 యూనిట్లకు పైగా అమ్ముడై అడ్వెంచర్ సెగ్మెంట్‌లో రారాజుగా నిలిచింది. కొండలు, కోనలు, బురద దారులు.. ఇలా ఎలాంటి కష్టతరమైన రోడ్డుపైనైనా సాఫీగా ప్రయాణించే దీని తత్వం రైడర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 2026 నెలలో కూడా 2,000 యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడుగా వచ్చిన గొరిల్లా 450 కూడా అమ్మకాల్లో తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కోటలో 350cc బైక్‌లే అసలైన బలం. క్లాసిక్ 350, హంటర్ 350 మోడళ్లు కంపెనీ మొత్తం అమ్మకాల్లో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. మన దేశంలో 350cc సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 94 శాతం మార్కెట్ వాటా ఉందంటే అది సామాన్యమైన విషయం కాదు. కేవలం క్లాసిక్ 350 ఒక్కటే 40 శాతం వాటాను కలిగి ఉండి, మిగతా కంపెనీలకు అందనంత ఎత్తులో ఉంది.
బడ్జెట్ అడ్వెంచర్ బైక్‌లే కాకుండా, పవర్‌ఫుల్ 650cc సెగ్మెంట్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వంటి బైక్‌లతో ఈ సెగ్మెంట్‌లో కంపెనీకి ఏకంగా 97 శాతం వాటా ఉంది. హిమాలయన్ 450 విషయానికి వస్తే, ఇందులో ఉన్న 452cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 40 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది, ఇది లాంగ్ టూర్లకు వెళ్లే వారికి పర్ఫెక్ట్ తోడుగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.3.05 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

